కాచిగూడలో ఆగి ఉన్న ట్రైన్ ను ఢీ కొట్టిన ఎంఎంటీఎస్ రైలు

0

అనుకోని రీతిలో ప్రమాదాలు జరుగుతూ హైదరాబాద్ వాసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న కల్యాణమండపం వద్ద నిర్మించిన గోడ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. పెళ్లి జరుగుతున్న వేళ.. ప్రాణాలు పోయిన వైనం గుండెలు అవిసేలా చేసింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు కాచిగూడ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న ప్రమాదం అవాక్కు అయ్యేలా చేస్తోంది.

మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్.. స్టేషన్లో ఆగి ఉన్న కొంగు ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టింది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామం షాక్ కు గురయ్యేలా చేసింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో దాదాపు పది మందికి పైనే గాయాలైనట్లుగా సమాచారం.

ఈ సమాచారం అందుకున్నంతనే రైల్వే శాఖ అధికారులు..సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను నిలిపివేశారు. ఎంఎంటీఎస్ సర్వీసులు మొదలైన తర్వాత ఈ తరహాలో ప్రమాదం ఇదే తొలిసారి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి మానవ తప్పిదం కంటే కూడా సాంకేతిక కారణాల వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు.
Please Read Disclaimer