కేటీఆర్ మాట.. టీఆర్ఎస్ కే దెబ్బపడింది.

0

‘కారు’ నిండితే ఏం చేస్తాం.. మరో కారులో వెళతాం.. కానీ తెలంగాణలో ఒకటే కారు ఉంది. అది సర్కారులో ఉంది. అప్పుడేం చేస్తాం.. మరో బస్సో రైలో చూసుకుంటాం. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ లో నాయకులు ఓవర్ ఫ్లో అయ్యారు. పట్టడానికి లేకుండా నిండిపోయారు. అందుకే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సాక్షిగా కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి..

తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. అక్కడ మున్సిపల్ టికెట్లు కావాలని ఒక్కో వార్డుకు ముగ్గురు నుంచి నలుగురు దరఖాస్తులు ఇవ్వడం వారంతా గులాబీ పార్టీలో కీలకంగా పనిచేసిన వారే కావడంతో ఆయనకు తలబొప్పి కట్టింది. ఈ పరిస్థితి తెలంగాణ అంతటా ఉంది..

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతలంతా కారెక్కేశారు. కాంగ్రెస్- బీజేపీ కార్పొరేటర్లు- కౌన్సిలర్లు- సర్పంచ్- ఎంపీటీసీలు- ఎంపీపీలు అధికార పార్టీలో చేరితే లాభపడుతామని అంతా టీఆర్ ఎస్ లో చేరారు. ఇబ్బడిముబ్బడిగా నేతలు చేరడంతో టీఆర్ ఎస్ హౌస్ ఫుల్ అయ్యింది.

ఇప్పుడు టీఆర్ ఎస్ లో ఆదినుంచి జెండా మోసిన నేతలు ఇతర పార్టీలనుంచి వలసవచ్చిన నేతలు చాలా మంది ఉన్నారు. వారందరికీ టికెట్లు ఇవ్వడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఐడియా వేశారు. ప్రజల్లో ఎవరు గెలుస్తారో సర్వే చేస్తామని.. వారికే మున్సిపల్ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్ ను ఖాళీ చేస్తోంది.

ఒక్కో వార్డుకు ముగ్గురు నలుగురున్నారు. వారిలో సర్వేలో తేలేది ఒకరే.. ఆ ఒకరికే సీటు.. మిగిలిన వారికి నిరాశే. అందుకే ఇప్పుడు బలమైన టీఆర్ ఎస్ మిగతా నేతల చూపుంతా బీజేపీ వైపు మళ్లుతోంది. టీఆర్ ఎస్ టికెట్ దక్కని బలమైన నేతలు బీజేపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారట… ఇప్పుడు గులాబీ బలమే బీజేపీవైపు టర్న్ అయ్యి మున్సిపాలిటీల్లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలేలా ఉందట.. కేటీఆర్ వేసిన సర్వే ప్లాన్ తో నేతలంతా ఇతరపార్టీల వైపు చూస్తున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దెబ్బ పడే సూచనలు ఉన్నాయట…
Please Read Disclaimer