గంప గోవర్ధన్..టీఆర్ ఎస్ కొంప ముంచేస్తారా?

0

నిజమేనండోయ్… పరిస్థితి చూస్తుంటే… టీఆర్ ఎస్ సీనియర్ నేత – ఆ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అలక వీడకుంటే మాత్రం కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ కొంప కొల్లేరవడం గ్యారెంటీనేనట. జిల్లాలో ఉన్నదే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు. అందులో జిల్లా కేంద్రం కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్… పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే… త్వరలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి దెబ్బ పడటం ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా వరుసగా రెండో పర్యాయం కూడా గంపకు విప్ పదవి ఇచ్చినా… ఆయనలో ఇంకా అసంతృప్తి ఏమిటనేదేగా? మీ డౌటు? ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకే దక్కిపోతున్న విప్ పదవి… ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంప గోవర్దన్ కు దక్కితే అవమానమే కదా. ఇదే భావనతో విప్ పదవి కేటాయించి ఏకంగా ఏడాది అవుతున్నా కూడా గంప గోవర్ధన్ ఆ పదవిని చేపట్టలేదట. మొత్తంగా గోవర్ధన్ తీరుతో కీలకమైన మునిసిపల్ ఎన్నికల ముందు కామారెడ్డిలో టీఆర్ ఎస్ కు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పక తప్పదు.

ఇక గంప గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే… టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన గంప గోవర్ధన్ 2009లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గోవర్ధన్… ఆ తర్వాత టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత 2014 – 2018 ఎన్నికల్లోనూ కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా గెలిచారు. గోవర్ధన్ ఏదో ఆషామాషీ నేత మీద గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత – మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఓడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గోవర్ధన్ సత్తా కలిగిన నేత కిందే లెక్క కదా. అంతేకాకుండా తన జిల్లాలోని బాన్సుబాడ నియోజకవర్గం నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డికి… కేసీఆర్ తన తొలి టెర్మ్ లో ఏకంగా కీలక మంత్రి పదవి ఇచ్చారు. తాజాగా అత్యున్నత పదవి అయిన స్పీకర్ పదవిని కూడా ఇచ్చారు. పోచారానికి ఇన్నేసి పదవులు ఇస్తున్న కేసీఆర్… తనకు మాత్రం కేవలం విప్ పదవిని ఇవ్వడమేమిటన్నది గోవర్ధన్ వాదనగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల తర్వాతనే తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన గోవర్ధన్… విప్ ఇచ్చినా సరిపెట్టుకున్నారట. తాజాగా 2018 ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన తనకు ఇప్పుడూ విప్ పదవితోనే సరిపెడతారా? అన్నది గోవర్ధన్ వాదన

అందుకే మంత్రి పదవి కాకుండా విప్ పదవి ఇచ్చిన పార్టీ అధిష్ఠానంపై తనదైన శైలి అలక బూనిన గోవర్ధన్… ఏడాది అవుతున్నా కూడా విప్ పదవిని చేపట్టలేదు. అంతేకాకుండా తనలోని అసంతృప్తిని గుర్తించని కేసీఆర్ వైఖరికి నిరసనగా తాజాగా పార్టీ కార్యక్రమాలకు కూడా గోవర్ధన్ దూరం దూరంగానే ఉంటున్నారట. తనలోని అసంతృప్తి పార్టీ అధిష్ఠానానికి తెలిసేలా సమీక్షల సందర్బంగా అధికారులపై అకారణంగానే ఆయన చిర్రుబుర్రులాడుతున్నారట. అయినా కూడా అధిష్ఠానంలో కదలికే కనిపించడం లేదట. దీంతో పార్టీ దూరంగా జరుగుతున్న గోవర్ధన్ మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి దెబ్బ కొట్టేలా సాగితే పరిస్థితి ఏమిటన్నది పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయట.
Please Read Disclaimer