రెడ్డి, వెలమలకు బలుపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

0

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నోరు జారారు. కులాల ప్రస్తావన తీసుకొస్తూ… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు కులాలను ప్రస్తావిస్తూ.. వారికి బలుపు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసముద్రంలో జరిగిన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బట్టల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన శంకర్ నాయక్. మనుషులకు మూడు రకాల బలుపు ఉంటుందన్నారు. మొదటిది రెడ్డి, వెలమ అనే కులం బలుపు.. రెండు ధనికుడు అనే బలుపు.. మూడోది బాగా చదువుకున్నామనే బలుపు ఉంటుందన్నారు. సమాజంలో మనుషులకు ఇలాంటి వివక్ష ఉండొద్దన్నారు. ఎవరిని కోసినా అదే రక్తం వస్తుంది.. అందరూ తినేది అదే అన్నం.. గాలి, నీరు అందరూ ఒకటే తీసుకుంటారు.. మరి కులాల అంతరాలు ఎందుకని ప్రశ్నించారు. సాటి మనిషికి సాయపడాలన్నారు.

శంకర్‌నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కులాల ప్రస్తావన తీసుకురావడంతో టీఆర్ఎస్‌ నేతలు కూడా ఒకింత షాక్‌తో ఉన్నారు. అంతేకాదు గతంలో కూడా శంకర్‌నాయక్ వివాదాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్‌తో విభేదాలతో ఓసారి వార్తల్లో నిలిచారు.. ఇప్పుడు మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్‌టాపిక్ అయ్యారు.
Please Read Disclaimer