జంపింగ్ కు రెడీ అవుతున్నారా..?

0

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ – బీజేపీ – టీడీపీ – వామపక్షాలన్నీ కూడా కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అధికార టీఆర్ ఎస్ నేతలు కదలికలు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. తాము ఇతర పార్టీల్లోకి జంప్ చేయడానికి ఇదే సరైన సమయమని పలువురు ఎమ్మెల్యేలు – ఎంపీలు – నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్లు సమాచారం.

నిజానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు మరింత జోష్తో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని – అవసరమైతే అధికారంలోకి రావాలని కమలదళం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు – నేతలు బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ వివేక్ తదితరులు కమలం గూటికి చేరారు. ఇంకా ముందుముందు చాలా మంది వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పదేపదే చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణకు ముందు – ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందు మంత్రి ఈటల రాజేందర్ – మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ధిక్కార స్వరం వినిపించారు. ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాత మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ క్రమంలో పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న వేళ.. ఆర్టీసీ సమ్మె మొదలైంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో గులాబీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను డిస్మిస్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ నిర్ణయాలను చాలామంది గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాము అనుకోలేదని సన్నిహితుల వద్ద చెప్పుకుంటుండం గమనార్హం.

ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పోకడను నిరసిస్తూ పార్టీ నుంచి జంప్ కావాలని పలువురు ఎమ్మెల్యేలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా.. సీఎం కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీని వీడితే ప్రజల్లో సానుభూతి ఉంటుందన్న ఆలోచనకు వస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఎప్పుడు ఎవరు బయటపడుతారో ? చూడాలి మరి.