శ్రీవారి ఆదాయంపై జగన్ సర్కారు కన్ను.. 20 రెట్లు అధికంగా సమర్పించుకోనున్న టీటీడీ

0

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఏపీ ప్రభుత్వానికి అందజేస్తున్న వార్షిక సాయాన్ని రూ.2.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ చట్టానికి సవరణలు చేయబోతున్నారు. టీటీడీ ఇక నుంచి కామన్ గుడ్ ఫండ్, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్, అర్చక సహాయక నిధులను అధిక మొత్తంలో అందించనుంది. డిసెంబర్ 28న జరిగిన ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. మొత్తంగా టీటీడీ నుంచి రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు సాయంగా అందనుంది.

2012లోనే పెరగాల్సింది కానీ..

కామన్ గుడ్ ఫండ్‌ను రూ.15 కోట్లకు, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్‌ను రూ.10 కోట్లకు పెంచాలని దేవాదాయ శాఖ కమిషనర్ 2012లో టీటీడీ ట్రస్ట్ బోర్డును కోరారని తెలుస్తోంది. అప్పట్లోనే టీటీడీ కోటాను పెంచుతూ చేసిన తీర్మాన్ని బోర్డు ఆమోందించింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని సవరించలేదు. దీంతో టీటీడీ ఇప్పటి వరకూ ప్రభుత్వానికి ఏటా రూ.2.5 కోట్లు చెల్లిస్తోంది.

అర్చక సహాయ నిధి చేర్పు..

తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. టీటీడీ నుంచి అధిక మొత్తంలో సాయం పొందడం కోసం దేవాదాయ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. అర్చక సహాయ నిధిని రూ.50 లక్షల నుంచి రూ.25 కోట్లకు పెంచే అంశాన్ని కూడా ఇందులో చేర్చాలని నిర్ణయించింది. ఇంతకు ముందు ప్రతిపాదనల్లో ఈ అంశం లేకపోవడం గమనార్హం.

పెరిగే సాయం ఇలా..

తాజాగా టీటీడీ కామన్ గుడ్ ఫండ్‌ను రూ. 1.25 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్‌ను రూ.50 లక్షల నుంచి 10 కోట్లకు పెంచారు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు అర్చక సహాయ నిధిని రూ. 50 లక్షల నుంచి రూ.25 కోట్లకు పెంచారు.

ఐదేళ్లకోసారి పెంపు..

దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న అర్చకులకు వేతనాల కోసం రూ.16 కోట్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం టీటీడీకి ప్రతిపాదించింది. వార్షిక సాయం పెంపును ఇప్పటికే పరిమితం కాకుండా.. ఐదేళ్లకోసారి పది శాతం చొప్పున పెంచాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

ధూప దీప నేవేద్యాలకు అదనం..

ఇప్పటి వరకూ కామన్ గుడ్ ఫండ్ కింద రూ.1.25 కోట్లు.. ధూప దీప నైవేద్యం కోసం రూ.16 కోట్లు.. మొత్తం రూ.17.25 కోట్లను టీటీడీ ఏటా ప్రభుత్వానికి ఇస్తోంది.

ఆలయాలకు సాయం కూడా..

తాజా అభ్యర్థనలకు అదనంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రభుత్వం టీటీడీని కోరింది. దీని వల్ల టీటీడీపై ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు భారం పడనుంది. టీటీడీ నిధుల వాటాను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే సమయంలో.. ట్రస్ట్ బోర్డు మీటింగ్‌లో పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం.
Please Read Disclaimer