ఇదేం పోయేకాలం.. తిరుమల ఆలయ గోపురానికి పిచ్చిమొక్కలా?

0

ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. మహమ్మారి కాలం కావటంతో భక్తలు సంఖ్య.. హుండీ ఆదాయం తగ్గింది కానీ.. మామూలు రోజుల్లో అయితే నిత్యం రెండు కోట్ల రూపాయిల హుండీ ఆదాయం తగ్గని పరిస్థితి. ఇక.. ప్రత్యేక రోజులు.. విశేష రోజుల్లో వచ్చే హుండీ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక.. ఇతర సేవలకు.. దానాలకు సంబంధించి వచ్చే ఆదాయం వందల కోట్లల్లో ఉంటుంది.

మరింత.. సంపన్న ఆలయ గాలి గోపురానికి పిచ్చి మొక్కలు మొలవటం దేనికి నిదర్శనం? శ్రీవారి ఆలయానికి వచ్చే ఆదాయంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉండే ఆలయాల నిర్వహణ భారాన్ని మోసే స్వామివారి గాలి గోపురానికి పిచ్చి మొక్కలు దర్శనమివ్వటం చూస్తే.. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో ఇట్టే అర్థమవుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో వేలాది మంది ఉద్యోగులు పని చేయటమే కాదు.. కొందరు ఉన్నతాధికారులకు కల్పించే వసతి సౌకర్యాలు ఒక స్థాయిలో ఉంటాయి. వీటన్నింటికి కారణమైన స్వామి వారికి సంబంధించిన విషయాల్లో ఇంత అశ్రద్ధ అన్నది ప్రశ్న. ఇక.. తిరుమల వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. గుడి బయటకు వచ్చిన తర్వాత విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవటం ద్వారా తిరుమల క్షేత్ర పర్యటనను పరిపూర్ణం చేసుకుంటారు.

విమాన వేంకటేశ్వరస్వామిని గుర్తించేందుకు వీలుగా చుట్టూ వెండి తోరణాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఆ వెండి తోరణం రూపుమారి కళావిహీనంగా ఉండటం చూస్తే.. టీటీడీకి ఏమైందన్న ప్రశ్న తలెత్తక మానదు. తిరుమలతో ప్రతి విభాగానికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నప్పటికీ అధికారులకు పట్టకపోవటం చూస్తే.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న కనీస ఆలోచన వారికి లేదన్న భావన కలుగక మానదు.