అమరావతిలో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి.. నేరుగా డీజీపీకి ఫోన్

0

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రైతులు, మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుండడంతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అమరావతిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి నేరుగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేశారు. రైతులు, మహిళల ఆందోళనలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అమరావతిలో ప్రస్తుత పరిస్ధితుల గురించి ఫోన్‌లో డీజీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న కేంద్రం అమరావతి ఆందోళనలపై ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే.. అమరావతి రైతులు రోజురోజుకూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు అమరావతి నుంచి మహిళలు ర్యాలీగా బయలుదేరారు. మహిళల ర్యాలీని అనుమతుల్లేవంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ర్యాలీని అడ్డుకోవడంతో మహిళలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతులు, మహిళలను చెదరగొట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మహిళలు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్నారు. అమరావతి నినాదాలతో హోరెత్తించారు.
Please Read Disclaimer