పీపీఏలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇవి జగన్ ఉద్దేశించేనా?!

0

టీడీపీ హయాంలో జరిగిన పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను సమీక్షకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొగ్గుచూపిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయగా, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఏపీ ప్రభుత్వ వైఖరిని కేంద్రం కూడా వ్యతిరేకించింది. తాగా, పీపీఏలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని నర్మదాలో శుక్రవారం ప్రారంభమైన విద్యుత్ శాఖ మంత్రులు, కార్యదర్శుల స్థాయి రెండు రోజుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.

అనుకూలమైన వాతావరణం లేకపోతే భవిష్యత్తులో పెరిగే విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా పెట్టుబడులు రావడం కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు పేరుకుపోవడంతో ఈ రంగంలో రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడంలేదని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

కాబట్టి, విద్యుత్‌ సంస్థలకు బకాయిపడ్డ రూ.59వేల కోట్లను డిస్కంలు తక్షణమే చెల్లించాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మన విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని, ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి మన అవసరాలకు సరిపడేంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు అవసరమని ఆర్కే సింగ్ పేర్కొన్నారు.

సులభతర వాణిజ్య విధానాలను అవలంబించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఒప్పందాలను మనం గౌరవిస్తామో? లేదో? తెలియకపోతే ఎవరైనా పెట్టుబడులకు ఎందుకు ముందుకొస్తారు? అని ప్రశ్నించారు. వినియోగదారులు తమకు ఇష్టమైన సరఫరాదారులను ఎంచుకునేలా ఎక్కువమందికి విద్యుత్ రంగంలో అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో అత్యధికులకు అవకాశం కల్పిస్తేనే ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, వచ్చే ఏడాదిలోపు వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రి సూచించారు.

ప్రస్తుతం వ్యవసాయానికి ఏటా రూ.8వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని, పరిశ్రమలకు తక్కువ ధరకే విద్యుత్‌ ఇవ్వాలని తెలిపారు. రూ.3 నుంచి 4కి విద్యుత్తు కొనుగోలుచేసి పరిశ్రమలకు రూ.8 నుంచి 9కి అమ్మే హక్కు ఎవరిచ్చారు? అని నిలదీశారు. హేతుబద్ధమైన ధరలకు ఇచ్చినప్పుడే పారిశ్రామిక రంగంలోకి పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆర్కే సింగ్ ఉద్ఘాటించారు.
Please Read Disclaimer