తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్నారా? ఈ అప్డేట్ మిస్ కావొద్దు

0

అంతకంతకూ పెరుగుతున్న మహమ్మారి కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే ఏ రాష్ట్రాలకు వెళ్లాలన్నా ఎలాంటి ఆంక్షలు లేని వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి.. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు.

ఏపీకి వెళ్లేందుకు రెండు మూడు రూట్లు ఉండగా.. ఎక్కువమంది నల్గొండ మీదుగా మాచర్ల వెళ్లేందుకు వయా వాడపల్లి మీదుగా వెళ్లటం తెలిసిందే. ఈ మార్గానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ వేళ నుంచి ఈ మార్గంలో పెద్ద ఎత్తున రాకపోకల్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం ఇదే మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజాగా పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టే ఉద్దేశంతో నల్గొండ ఎస్పీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

వాడపల్లి మీదుగా ఏపీకి వెళ్లే వారందరికి పాసులు ఉంటేనే అనుమతిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారికి పాసులు అవసరం లేదు కానీ.. ఏపీకి వెళ్లే వారికి మాత్రం ఆ రాష్ట్రం జారీ చేసిన పాసులు ఉండాలని చెబుతున్నారు. అంతేకాదు.. వాడపల్లి మీదుగా వెళ్లే వాహనాల్ని ఉదయం ఏడు గంటల తర్వాత.. రాత్రి ఏడు గంటల కంటే ముందే చేరుకోవాలని చెప్పారు. అత్యవసర వస్తువులు.. సరకురవాణాకు సంబంధించి సంబంధిత పత్రాలు సరిగా ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు వరకూ ఏపీకి వెళ్లే ప్రయాణాల్ని అనుమతిస్తామని నల్గొండ ఎస్పీ పేర్కొనటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer