కేసీఆర్ దాచిన విషయాన్ని చెప్పేసింది

0

ఓవైపు సినిమాలు…మరోవైపు రాజకీయాలను విజయవంతంగా ఏకకాలంలో కొనసాగిస్తున్న ప్రముఖ నటి – తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తాజాగా ఆసక్తికర కామెంట్లతో తెరమీదకు వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో దఫా పగ్గాలు చేపట్టిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్..మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో…విజయశాంతి ఓ ఆసక్తికర రివ్యూ చేశారు. టీఆర్ ఎస్ ను చూసి జాతీయ పార్టీలైన టీఆర్ ఎస్ – కాంగ్రెస్ పార్టీలు సైతం తట్టుకోలేకపోతున్నాయని విజయశాంతి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఏడాది పాలనపై రాములమ్మ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఆర్ ఎస్ కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం ఇదే అభిప్రాయంతో ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విశ్లేషించారు. `టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని – ముఖ్యమంత్రి దొరగారు – ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ కలిమితో ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.` అంటూ ఎద్దేవా చేశారు.

మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి… ప్రభుత్వ ఉద్యోగులు – అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ గారు సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని వియశాంతి వ్యంగ్యంగా విమర్శించారు. “ప్రభుత్వ ఉద్యోగులు – అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్ సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కేసీఆర్ తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారు.` అంటూ మండిపడ్డారు.

ప్రభుత్వ ఖజానాను ముంచేసి – ఇంతకాలం మాయమాటలు చెప్పిన సీఎం దొరగారు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పలేదు అని విజయశాంతి వ్యాఖ్యానించారు. “ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి… ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు“ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.




Please Read Disclaimer