విశాఖలో రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జ్‌పై నుంచి కిందపడిన బస్సు

0

విశాఖ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ దగ్గర ప్రైవేట్ బస్సు బ్రిడ్జిపై నుంచి 14 అడుగుల లోతులో వరహానది ఒడ్డున పడిపోయింది. చెన్నై నుంచి విశాఖ వెళుతుండగా.. పెనుగొండ దగ్గర ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి స్థానికులు గుర్తించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని బయటికి తీశారు.. వారికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ప్రాణాపాయ పరిస్థితి ఎవరికీ లేదని పోలీసులు చెబుతున్నారు. రాత్రి సమయంలో డ్రైవర్‌కు నిద్ర రావడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో ఎక్కువమంది ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.