వైజాగ్‌లో అశ్విన్ రికార్డ్.. మురళీధరన్ సరసన

0

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. మ్యాచ్‌‌లో ఆఖరి రోజైన ఆదివారం తొలి సెషన్ ఆరంభంలోనే డిబ్రయిన్ (10: 25 బంతుల్లో 2×4) వికెట్ పడగొట్టిన అశ్విన్.. టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దాంతో పాటు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గానూ నిలిచాడు.

టెస్టుల్లో వేగంగా 350 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా అతని సరసన రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. సుదీర్ఘ కెరీర్‌లో మురళీధరన్ 66 టెస్టుల్లో ఈ మార్క్‌ని అందుకోగా.. అశ్విన్ కూడా సరిగ్గానే 66 టెస్టుల్లోనే అందుకోవడం విశేషం.

భారత టెస్టు జట్టులోకి 2011, నవంబరులో అరంగేట్రం చేసిన అశ్విన్.. అనతికాలంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగాడు. అయితే.. గత ఏడాదన్నర కాలంగా కుల్దీప్ యాదవ్, చాహల్ నిలకడగా రాణిస్తుండటంతో వారికి అశ్విన్ స్థానంలో టెస్టుల్లో అవకాశమివ్వాలని డిమాండ్ వినిపించాయి. దీంతో.. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో అశ్విన్‌కి కనీసం తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎట్టకేలకి వైజాగ్ టెస్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ చెలరేగిపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఏడు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ వికెట్‌తో తన వేట ప్రారంభించాడు.
Please Read Disclaimer