తెలంగాణ బ్రాండ్ డ్యామేజ్ చేసే ఫోటో

0

హైదరాబాద్లో బుధవారం కురిసిన భారీ వర్షం నగరవాసులకు నరకం చూపించింది. మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా నీరు చేరడంతో రోగులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి నీళ్ళు చేరాయి. ఆస్పత్రి ప్రాంగణంలో చెత్త ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయింది. దీంతో రోగులు – వైద్యులు – వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా బుధవారం కంటే రెండు రోజుల ముందే ఈ తరహా వరద నీరు ఆస్పత్రిలోకి చేరింది.

కాగా భారీ వర్షాలకు నగరంలోని బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ – మాదాపూర్ – కూకట్పల్లి – జేఎన్టీయూ – ప్రగతినగర్ – ముసాపేట – బాలానగర్ – ఉప్పల్ – నాగోలు – ఈసీఐఎల్ – చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇదిలాఉండగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కొద్దిపాటి వర్షానికే నీళ్లు చేరాయని నీళ్ళతో పాటు చెత్త కూడా చేరిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉస్మానియా ఆసుపత్రినీ మోడల్ ఆసుపత్రిగా చేస్తానని కొత్త భవనాలు నిర్మిస్తానని మాటలు చెప్పారు.. కానీ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా చెత్త చెదారం కనబడుతుందని మండిపడ్డారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు కూడా లేదని ఇతర సదుపాయాలు ఏమీ లేవని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోతున్నారని ఆయనకు అధికారంలో ఉండే హక్కే లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఉస్మానియా ఆస్పత్రి మాదిరిగా కాకుండా ఉండాలంటే సీఎం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి.. అక్కడ వసతులు కల్పించాలన్నారు. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి గురించి ఎవరికి చెప్పాలో… ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. తాను ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకొని ట్రీట్ మెంట్ చేయడాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి ఎప్పుడు కూలిపోతుందో తెలియడంలేదని చిన్నపాటి వర్షానికే వరదలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.