సీఎం కేసీఆర్ ఎక్కడ? ఇప్పుడిదే ట్రెండింగ్

0

సీఎం కేసీఆర్ ఎక్కడా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు.. ఆయన కోసం ఏకంగా ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. కరోనా ప్రబలిన కొత్తలో సీఎం కేసీఆర్ చేసిన సందడి అంతా ఇంతాకాదు.. తన సహజ శైలికి భిన్నంగా లాక్ డౌన్ విధించి రోజు విడిచి రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలకు ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చెవులు నిక్కబొడుచుకొని వినేలా పాపులర్ అయ్యారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అన్ని దుకాణాలు తెరిచి అన్ లాక్ ప్రకటించిన వేళ కనిపించకుండా పోయారన్న అపవాదు ఉంది. ఆయన ప్రెస్ మీట్లు లేవు.. కరోనా పై తెలంగాణలో చర్యలు లేవంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ గురించి అందరూ ఆరాతీస్తున్నారు.

తాజాగా తెలంగాణలో కరోనా జెట్ స్పీడుగా పెరుగుతోంది. గత రెండు రోజులుగా తెలంగాణలో 3700 కరోనా కేసులు నమోదయ్యాయి. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనూ పలువురికి కరోనా సోకింది. దీంతో ఆయన ఫాంహౌస్ కు మకాం మార్చారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ చూపు లేక ఇప్పుడు నెటిజన్లు మీడియా ఆయన కోసం తెగ ఆరాతీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.