తెలంగాణ చింటూ.. పింటూలు ఎవరో తెలుసా?

0

యధాలాపంగా చేసే కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళతాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకసభ్యులు.. మంత్రులైన కేటీఆర్.. హరీశ్ రావులను ఉద్దేశిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్.. అద్దంకి దయాకర్ లు చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

కేటీఆర్.. హరీశ్ రావులకు వ్యంగ్యంగా పెట్టిన పేర్లు రానున్న రోజుల్లో మరింతమంది ఉపయోగించేలా ఉండటం గమనార్హం. కేటీఆర్ ను చింటూగా.. హరీశ్ రావును పింటూగా అభివర్ణించిన కాంగ్రెస్ నేతలు.. గతంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే చింటూ.. పింటూలు ఇప్పుడు ఎక్కడ? అని సూటిగా ప్రశ్నించారు.

దేశంలో మరెక్కడా లేనంత దుర్మార్గ పాలన తెలంగాణలో సాగుతుందని.. అప్రస్వామిక.. రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చేస్తున్నట్లు మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు చెందిన వారు ఇబ్బంది పడుతున్నారని.. రైతుబంధు లేదు.. వర్షాలు పడినా ఆదుకునే వారే ఉండటం లేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదని.. కార్మికులు.. విద్యార్థులు.. ఇలా ఒకరేమిటి? అందరూ బాధ పడుతున్నట్లు విమర్శలు గుప్పించారు.

గతంలో ప్రతి విషయానికి తామున్నట్లుగా ముందుకు వచ్చే చింటూ.. పింటూలు ఇప్పుడు ఎక్కడకు వెళ్లారని.. ప్రతి దానికి తామే పెద్ద పోటుగాళ్లమంటూ ముందుకొచ్చే కేటీఆర్..హరీశ్ లు ఎక్కడకు పోయారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్లు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదెందుకంటూ నిలదీశారు.

ఒకాయన జాయ్ 2019 అంటూ విలాసాలు చేస్తున్నారు. మరొకరు వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న వేళ.. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ఫుట్ బాట్ ఆట ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువేనని.. ప్రతిపక్షాల గొంతు నొక్కటమే కాదు మీడియాపైనా విపరీతమైన ఒత్తిడితో నిజాలు బయటకు రావటం లేదన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాడుతున్నామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో డెంగీ కారణంగా అనేకమంది చనిపోతున్నా.. రాష్ట్ర ఆరోగ్య మంత్రి మాత్రం పదవి పోతుందన్న భయంతో గొంతు మీద వేలాడతున్న కత్తిని చూసి భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. మరి ఈ విమర్శలకు చింటూ.. పింటూలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Please Read Disclaimer