Templates by BIGtheme NET
Home >> Telugu News >> పీకే ప్రశ్నకు జగన్ జవాబిస్తారా?

పీకే ప్రశ్నకు జగన్ జవాబిస్తారా?


ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పాలనపై జనసేనాని పవన్ కల్యాణ్ చాలా లాజికల్ గా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై తనదైన శైలిలో జగన్ సర్కారుపై వరుసగా విరుచుకుపడిన పవన్… తాజాగా మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ సర్కారును గడగడలాంచారనే చెప్పాలి. ఏపీలో భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ఓ నిధిని ఏర్పాటు చేసింది. సదరు నిధిలో ఏకంగా రూ.450 కోట్లను జగన్ సర్కారు ఇతరత్రా అంశాలకు ఖర్చు చేసిందట. గట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారాన్ని పవన్ అప్పుడే పట్టేశారు. ఆ వెంటనే జగన్ సర్కారుపై ఆయన దాడి మొదలెట్టారు.

ఈ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావించిన పవన్.. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధికి చెందిన నిధులను మళ్లించేందుకు జగన్ ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని సూటిగానే ప్రశ్నించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలను పవన్ ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక కొరత తలెత్తిందని దీంతో పనులు లేక పస్తులతోనే కొందరు కార్మికులు కష్టాలు పడితే మరికొందరు ఏకంగా ఆత్మహత్యలే చేసుకున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితులు వచ్చాయని.. ఫలితంగా భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కరువైందని పవన్ పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కార్మికులను ఆదుకునేందుకే భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని పవన్ పేర్కొన్నారు. అలాంటి నిధిని కార్మికుల సంక్షేమం కోసం వాడకుండా ఇతరత్రా వ్యవహారాల కోసం ఎలా వాడతారని పవన్ ప్రశ్నించారు. అసలు ఈ నిధి నుంచి డబ్బులను మళ్లించే అధికారం జగన్ కు ఎవరిచ్చారని కూడా పవన్ నిలదీశారు. ఈ నిధి నుంచి మళ్లించిన రూ.450 కోట్ల నిధులను వైసీపీ సర్కారు తన సొంత అవసరాలకు వాడుకొందని కూడా పవన్ ఆరోపించారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న పవన్… రాష్ట్రంలోని 22 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికుల హక్కులను కాలరాయడమేనని కార్మిక చట్టాల ఉల్లంఘననేనని కూడా ఫైరయ్యారు. మరి పవన్ ప్రశ్నలకు జగన్ సర్కారు ఎలాంటి సమాధానం ఇస్తుందో? అసలు స్పందిస్తుందో? లేదో? కూడా చూడాలి.