చనిపోయిన ప్రియుడు రెండేళ్ల తర్వాత ప్రత్యక్షం.. యువతికి ఊహించని షాక్!

0

తన ప్రియుడు చనిపోయాడనే బాధతో ఆమె సొంత ఊరును వదిలి వెళ్లిపోయింది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆమెకు అతడు ప్రాణాలతో కనిపించాడు. దీంతో ఆమె తొలుత షాకైంది. ఆ తర్వాత కోపంతో ఊగిపోయింది. అదేంటీ.. ప్రియుడు బతికి వస్తే సంతోషించాలేగానీ.. అలా ఆగ్రహంతో ఎందుకు రగిలిపోయిందనే కదా మీ డౌట్? అయితే, ఆమె ఏం చెప్పిందో చూడండి.

ఆస్ట్రేలియాకు చెందిన రాచెల్ అనే యువతి ఏబీసీ.నెట్ అనే వెబ్‌సైట్ ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 18 ఏళ్ల వయస్సులో రాచెల్‌కు స్థానిక పబ్‌లో ఓ చెఫ్‌తో (ప్రియుడి పేరు వెల్లడించలేదు) పరిచయం ఏర్పడింది. వారి ప్రేమ కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే, అతడు రెస్టారెంట్‌లో ఉద్యోగం కోల్పోయిన రోజు నుంచి అసలు కష్టాలు మొదలయ్యాయి.

ఉద్యోగం లేకపోవడంతో అతడు ఆమె నుంచి కొంత మొత్తాన్ని అరువుగా తీసుకున్నాడు. వాటిలో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. కొద్ది రోజుల తర్వాత వారి బంధం ఎన్నాళ్లో నిలవలేదు. ఇద్దరు విడిపోయారు. దీంతో రాచెల్ అతడు చెల్లించాల్సిన డబ్బులన్నీ తిరిగి ఇవ్వాలని అడగటం మొదలుపెట్టింది. ఇందుకు అతడు నిరాకరించాడు. ఆమె ఫోన్ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించడం మానేశాడు. ఓ రోజు అతడి రూమ్‌మేట్స్ ఫోన్ చేసి తమ గదిలో వస్తువులన్నీ మాయం అవుతున్నాయని రాచెల్‌కు చెప్పారు. అయితే, అతడితో తనకు సంబంధం లేదని, తనని అడగ వద్దని చెప్పింది. కొద్దిరోజుల తర్వాత రాచెల్ ప్రియుడి తల్లికి ఫోన్ చేసింది. దీంతో ఆమె తన కొడుకు ప్రాణాలతో లేడని, ఇటీవలే చనిపోయాడని తెలిపింది.

ఈ దుర్వార్త వినగానే రాచెల్ బాధతో కుమిలిపోయింది. అతడి జ్ఞాపకాలు వెంటాడటంతో ఆ ఊరిని వదిలి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. రెండేళ్ల తర్వాత మళ్లీ సొంత ఊరుకు వచ్చిన రాచెల్ తన ఫ్రెండ్ కలిసి ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ తన మాజీ ప్రియుడి రూపంలో ఉన్న వ్యక్తిని చూసి షాకైంది. అది అతనా, కాదా అని నిర్ధరించుకోవాలని భావించి హోటల్‌లో వివరాలు అడిగి తెలుసుకుంది. చనిపోయాడని భావించిన అతడు బతికి ఉన్నందుకు సంతోషించాలా? బాధపడలా అనే సందిగ్ధంలో మునిగిపోయింది.

కోపంతో అతడి తల్లికి ఫోన్ చేసి.. ‘‘నీ కొడుకు బతికే ఉన్నాడని నాకు తెలిసిపోయింది. నాకు ఎందుకు అలా చెప్పారు?’’ అని ప్రశ్నించింది. అయితే, అవతలి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె ఆగ్రహం మరింత రెట్టింపయ్యింది. అతడిని నిలదీయాలని అనుకుంది. కానీ, అతడితో మాట్లాడాలంటేనే ఆమెకు చిరాకు అనిపించింది. ఆ విషయాన్ని అక్కడే వదిలిపెట్టి.. అతడి గురించి ఆలోచించడం మానేశానని రాచెల్ వెల్లడించింది.
Please Read Disclaimer