వ్యక్తి కంట్లో ఏలిక పాము.. 12 ఏళ్ల తర్వాత వెలికితీత, కుక్క కరవడంతో..

0

కంటిలో చిన్న నలక పడితేనే విలవిల్లాడతాం. అలాంటిది ఆ వ్యక్తి కంట్లో ఏకంగా ఏలిక పామే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్లుగా అది అతడి కంట్లోనే ఉంది. అప్పుడప్పుడూ నేనున్నా.. అంటూ నొప్పి కలిగిస్తూ చెప్పినా, సాధారణ నొప్పే అనుకుని అతడు పట్టించుకొనేవాడు కాదు. కానీ, ఇటీవల నొప్పి బాగా తీవ్రంగా మారడంతో వైద్యులను ఆశ్రయించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతడి కంట్లో తెల్లగుడ్డును చుట్టుకుని మెరుస్తున్న సన్నని ఏలిక పామును వెలికి తీశారు. మరి, కంట్లో ఏలిక పాముకు, కుక్కకు ఏమిటి సంబంధం అని అనుకుంటున్నారా? అయితే, ఏం జరిగిందో చూడండి.

గుజరాత్‌కు చెందిన జాసుభాయ్ పటేల్(70) గత కొన్నేళ్లుగా కంటి దురద నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఆ సమస్య మాత్రం తీరలేదు. దీంతో భరూచ్‌లోని నారాయణ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌లో డాక్టర్ మిలన్ పాంచాల్‌ను కలిశాడు. ఆయన మైక్రోస్కోపిక్ పరికరంతో పటేల్ కంటిని పరిశీలించగా.. తెల్లగుడ్డు వెనుక ఏదో తాడులాంటిది కనిపించింది. దాని కదలికలను బట్టి ఏలిక పాముగా గుర్తించారు. దాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుందని, లేకపోతే కంటికే ప్రమాదకరమని చెప్పారు.

పటేల్‌కు మత్తు ఇచ్చిన వైద్యులు ఎంతో జాగ్రత్తగా అతడి కంట్లో ఉన్న ఏలిక పామును వెలికి తీశారు. అది తెల్లగా, సన్నగా 7 సెంటీ మీటర్ల పొడవు ఉందని డాక్టర్ మిలన్ చెప్పారు. ఇంకా బతికే ఉందని తెలిపారు. దాన్ని తొలగించకపోయి ఉంటే కంటి చూపు దెబ్బతినేదని, అది రక్తప్రవాహంలో కలిసి మెదడుకు చేరుకొనే అవకాశం ఉందన్నారు. దీన్ని తీయడానికి సుమారు 25 నిమిషాలు పట్టిందన్నారు. 12 ఏళ్ల కిందట అతడిని కుక్క కరిచిందని, ఆ గాయం ద్వారా పరాన్న జీవి రక్తంలో కలిసి కంటికి చేరుకుని ఉండవచ్చని తెలిపారు. సాధారణంగా అవి కంటికి కనిపించవని, అది కంట్లోనే తిష్టవేసి పెద్దదైందన్నారు.
Please Read Disclaimer