వల్లభనేని వంశీకి షాక్.. హైకోర్టులో వైసీపీ పిటిషన్!

0

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ కేవలం 23 మంది సీట్లను మాత్రమే దక్కించుకుంది. అయితే, ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా, మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి వ్యాజ్యం దాఖలు చేయడం గమనార్హం. కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం ఎన్నికల పిటిషన్‌ దాఖలైంది.

గన్నవరం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి వై.వెంకటరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను వంశీ ఉల్లంఘించారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి వంశీ అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే వంశీ సూచన మేరకు ఆయన అనుచరులు పాత తహశీల్దార్‌ సంతకంతో ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారని.. ఇవి నకిలీవని తెలుసుకున్న కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వెంకటరావు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంతేకాదు పోస్టల్‌ బ్యాలెట్లను మరోసారి లెక్కించేలా ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు.

మరోవైపు, నలుగురు పిల్లలున్నా, ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం తనకు ముగ్గురే ఉన్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తప్పుడు వివరాలను పొందుపరిచారని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే, బలరాంలకు ఒక కుమార్తె ఉందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఆయన పేర్కొన్నారు. ఆమెకు సంబంధించి హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల లిస్ట్‌లో తండ్రి పేరు కేబీఆర్‌కే మూర్తి, ఆధార్‌ కార్డులో కరణం బలరామకృష్ణమూర్తిగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటికి సంబంధించి వివిధ ఫొటోలను ఆయన మీడియాకు చూపించి, బలరాంను తండ్రిగా పరిగణించడానికి ఇవే సాక్ష్యాలని వివరించారు. ఈ విషయంపై ఇటీవల హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తండ్రిగా బలరాం ఒప్పుకోకపోతే, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమేనని ఆయన కుమార్తె తనకు చెప్పిందని కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.
Please Read Disclaimer