పవన్ పై వైసీపీ నేతల విసుర్లు… ఘాటు పెరిగిపోయిందబ్బా

0

ఏపీలో ఇసుక కొరతను బేస్ చేసుకుని జనసేన అధినేేత పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం వైసీపీ ప్రభుత్వంపై విసురుతున్న ఆరోపణలు ఓ రేంజిలో ఉంటున్నాయనే చెప్పక తప్పదు. అయితే పవన్ ను నిలువరించేందుకు రంగంలోకి దిగుతున్న వైసీపీ నేతలు… పవన్ ను మించి విమర్శలు గుప్పిస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ పై వైసీపీ విమర్శలు… క్రమంగా ఘాటెక్కుతున్నాయన్న వాదనలూ లేకపోలేదు. వైసీపీ నుంచి వరుసగా ఎంట్రీ ఇస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నేతలు… పవన్ ను ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. ఈ మాటల్లో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన విమర్శలు కూడా క్రమంగా పెరుగుతున్నాయనే చెప్పక తప్పదు. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే… పవన్ పై విమర్శలు ఇంకే రేంజికి వెళతాయోనన్న కొత్త చర్చలు అప్పుడే మొదలైపోయాయి.

నిన్నటికి నిన్న సినిమాలను వదిలేసిన పవన్… యాక్టింగ్ ను మాత్రం వదల్లేదని వైసీపీ మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మాట్లాడే అర్హత కూడా పవన్ కు లేదని కూడా కన్నబాబు రూలింగ్ ఇచ్చేశారు. ఒక్క సీటుకే ఇంతగా రెచ్చిపోతే… ఇంకొన్ని సీట్లు వచ్చి ఉంటే పవన్ ఏ రేంజిలో విరుచుకుపడేవారోనని కూడా కన్నబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎంట్రీ ఇచ్చిన వైసీపీ నేత ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. పవన్ ను మరింతగా టార్గెట్ చేశారు. పవన్ చేసుకున్న పెళ్లిళ్లను పరోక్షంగా ప్రస్తావించిన సుధాకర్ బాబు… పవన్ ఓ చేతిలో తాళిని పట్టుకుని మరో చేతిలో ఎగతాళిని పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఎవరి మెడలో ఎప్పుడు తాళి కడతారో ఎవర్ని ఎప్పుడు ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదంటూ సుధాకర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పవన్.. కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని సుధాకర్ బాబు మరో పవర్ పంచ్ సంధించారు. మొత్తంగా పవన్ పై విమర్శల్లో రాజకీయ విమర్శలను దాదాపుగా పక్కనపెట్టేసినట్టుగా కనిపిస్తున్న వైసీపీ నేతలు… ఆయనను వ్యక్తిగతంగానే టార్గెట్ చేసి ఆయన నోటికి తాళం వేసే వ్యూహానికి పదును పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు వద్దంటూనే… పవన్ ను టార్గెట్ చేసిన ప్రతి వైసీపీ నేతా పవన్ వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడుతుండటం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
Please Read Disclaimer