వాడీవేడీ చర్చలో.. లోక్ సభలో చల్లగా నిద్రపోయిన వైసీపీ ఎంపీ!

0

దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారం పై పార్లమెంట్ ఉభ సభల్లోనూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆమె జరిగిన ఘాతుకానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. అతి కిరాతకంగా నలుగురు మృగాళ్లు ఆ యువతిని అత్యాచారం చేసి సజీవ దహనం చేయడంపై పార్లమెంట్ కూడా స్పందించింది.

ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఆ ఘటనను ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఆ మేరకు స్పందించింది. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది.

ఆ చర్చ సందర్భంగా అనేక మంది ఎంపీలు భావోద్వేగానికి గురయ్యారు. తీవ్రంగా స్పందించారు. కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవేశ పూరితంగా ప్రసంగించారు. ఆ వైనాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

అయితే అంత వాడీవేడీ చర్చలో ఒక ఎంపీ తూగుతూ కనిపించారు. లోక్ సభ లో హీటింగ్ డిబేట్ జరుగుతున్న సమయంలో ఆయన తాపీగా నిద్రపోతూ కనిపించారు. ఆయన ఒక తెలుగు ఎంపీ కావడం గమనార్హం. ఆయనే మరెవరో కాదు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.

పోలీసాఫీసర్ గా పని చేసి ఆ గుర్తింపుతో రాజకీయాల్లోకి వచ్చి తొలి సారే మంచి మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు మాధవ్. ఒక మాజీ పోలీస్ అనే భావన కూడా ఇలాంటి చర్చ సమయంలో ఆయనను నిద్ర లేకపోయినట్టుగా ఉంది. ఎంపీలు నెత్తీనోరు మోదుకుని మాట్లాడుతూ ఉంటే ఆయన చల్లగా నిద్ర పోయారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ గా మారాయి. లోక్ సభలో ఇది వరకూ పలువురు ప్రముఖులు కూడా నిద్ర పోతూ వార్తల్లోకి ఎక్కారు. ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో బీజేపీ ఎంపీలు నిద్ర పోతున్న వైనాలు వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో మాధవ్ తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా కీలక చర్చా సమాయాల్లో కూడా నిద్ర పోతూ ఎంపీలు ఏం సందేశం ఇస్తున్నట్టో!
Please Read Disclaimer