పీవీపీని గంటల వ్యవధిలో స్టేషన్ లో కూర్చోబెట్టే ఈ కైలాశ్ ఎవరంటా..!

0

అందరికి పేర్లు ఉంటాయి. కొందరి పేర్లు మాత్రం బ్రాండ్ గా మారుతుంటాయి. ఆ కోవలోకే వస్తారు పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్. తాజాగా ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కావటమే కాదు.. అరెస్టు వరకూ విషయం వెళ్లటం సంచలనంగా మారింది. సినీ రంగ పరిశ్రమతో పాటు.. ఏపీ రాజకీయాల్లోనూ సుపరిచితుడు.. ఏపీ అధికారపక్ష నేతకు దగ్గరి వాడన్న పేరున్న పీవీపీ లాంటి హైప్రొఫైల్ వ్యక్తిని అదుపులోకి తీసుకునే వరకూ విషయం వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.

పేరుకు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నా.. చిన్న చిన్న సూత్రాలు మర్చిపోతే ఇలాంటి తిప్పలు తప్పవని చెబుతారు. ఇంతకీ పీవీపీ చేసిన తప్పేంటి? అసలు ఈ ఇష్యూ ఎలా మొదలై.. ఎక్కడికి వెళ్లింది? ఈ వ్యవహారంలో పీవీపీ నేరుగా సీన్లోకి రావాల్సిన అవసరం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరుతో పీవీపీ గతంలో విల్లాలు అమ్మారు. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ.4కోట్లకు పైనే ఉంటుందని చెబుతారు. అలా కైలాస్ అనే వ్యక్తి ఒక విల్లాను పదిహేను నెలల క్రితం కాన్నాడు. ఆర్నెల్ల క్రితం టెర్రస్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. అయితే.. అలా పనులు చేయించొద్దని పీవీపీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. మాట కాదంటే ఇల్లుకూల్చేస్తామని చెప్పారట. అప్పట్లో పనులు ఆపేసిన కైలాస్.. తాజాగా మరోసారి పనులు షురూ చేశారు.

ఇదిలా ఉండగా.. తాను పనులు చేయిస్తున్న సమయంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్న సమయంలో పదిహేను మందితో కలిసి పీవీపీ తన విల్లా వద్దకు వచ్చారని ఫిర్యాదుదారుడు చెబుతున్నారు. బుధవారం ఉదయం పదిహేను మందితో వచ్చిన పీవీపీ అరుపులు.. కేకలతో బెదిరింపులకు దిగారన్నారు. ఇంట్లోకి ప్రవేశించి టెర్రస్ పైన నిర్మాణాలు కూల్చేశారని ఆరోపించారు. అయితే.. ఈ వ్యవహారంపై పీవీపీ వాదన మరోలా ఉంది. విల్లాను అమ్మే వేళలోనే ఎలాంటి రూఫ్ టాప్ లు నిర్మాణం చేపట్టొద్దని.. నిర్మాణ డిజైన్లు మార్చకూడదన్న విషయం నిబంధనల్లో ఉందని చెప్పినట్లుతెలుస్తోంది.

అలాంటి రూల్స్ ను బ్రేక్ చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సూటు వేసుకొని పదిహేనుమంది మనుషుల్ని వెంట తీసుకెళితే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చోక ఏమవుతుంది? అయినా.. ఎవరో ఒక విల్లా ఓనరు తనకు తోచినట్లు చేస్తుంటే.. చేయాల్సింది చేయకుండా.. సీన్లోకి నేరుగా దూసుకెళ్లిపోవటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. అయినా.. పీవీపీని గంటల వ్యవధిలో స్టేషన్ లో కూర్చోబెట్టేంత సత్తా ఉన్న ఈ కైలాశ్ ఎవరంటా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చూస్తుంటే ఈ కుర్రాడిలో ఏదో విషయం ఉందన్న భావన కలుగక మానదు. అదేమిటంటారు?
Please Read Disclaimer