వైకాపా ఎమ్మెల్యే స్టిక్కర్‌‌తో.. రాజు గారి షి‘కారు’! ట్రోల్ చేస్తున్న టీడీపీ..

0

తాను కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచినా దళితుడినని అవమానిస్తున్నారని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఇటీవలే ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలు తనను చులకనగా చూస్తున్నారని, తన పనిని తాను చేసుకోనీయడం లేదని ఆయన గతంలో వాపోయారు. గాంధీ జయంతి సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి మరో అంశం తెరమీదకి వచ్చింది.

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో..

పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఓ కారు కొన్న సదరు నేత.. తన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ వేయించుకొని తిరుగుతున్నారట. దీంతో ‘రాజు’ గారి తీరు పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

జగన్ అంటే అమితాభిమానం..

జగన్ పట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల.. బాబూరావుకి ఎనలేని అభిమానం ఉందని.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు ఎమ్మెల్యేకు లభించే గౌరవం దక్కడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తిరుప‌తి ద‌ర్శ‌నం కోసం సిఫారసు లేఖ నుంచి.. కాంట్రాక్టుల వ‌ర‌కూ ఏవైనా సరే ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగిపోతాయట. బదిలీలు, పోస్టింగుల విషయంలోనూ ఇదే తీరట. ఎమ్మెల్యే లెట‌ర్ హెడ్ కూడా అక్క‌డి అధికార పార్టీ నేత ద‌గ్గ‌రే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

షాడో ఎమ్మెల్యే..

పాయ‌క‌రావుపేట ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచింది గొల్ల బాబూరావే అయినప్పటికీ.. సదరు రాజు గారు అధికారికంగా ఎమ్మెల్యేగా చెలామ‌ణీ అవుతున్న‌ారని, ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలోని వ్యవహారాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.

టీడీపీ శ్రేణుల ప్రచారం..

సదరు రాజు గారి కారు మీద ఎమ్మెల్యే పాయకరావుపేట అని రాశారని చెప్పడమే కాదు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Please Read Disclaimer