వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇక అక్కడే!

0

ఇన్నాళ్లూ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వేదికగా కొనసాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏపీలో త్వరలోనే ఓపెన్ కాబోతోంది. ఈ మేరకు తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ బిల్డింగ్ రెడీ అయినట్టేనని తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కాబోతోందని సమాచారం.

ఇప్పటికే లోటస్ పాండ్ నుంచి ముఖ్యమైన సామాగ్రిని అంతా కొత్త కార్యాలాయానికి తరలించే ప్రక్రియ పూర్తి అవుతోందని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్వహించనున్నారట. ఇది అద్దెభవనం అని సమాచారం. ఇలా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రెడీ అవుతోంది.

ఎన్నికలకు ముందు వరకూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు హైదరాబాద్ లోనే కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో టీడీపీ పలు విమర్శలు చేసింది. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటిని పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారాన్ని కూడా జగన్ హైదరాబాద్ నుంచి నే ఏపీకి వచ్చి వెళ్తూ చేపట్టారు. సీఎంగా అమరావతిలో అడుగుపెట్టారు.

ఇప్పుడు ఆయన వెంటే కేంద్ర కార్యాలయం కూడా తరలుతూ ఉంది. అలాగే విజయవాడ ఎంజీ రోడ్లో నిర్వహిస్తూ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రధాన కార్యాలయంలోకే తరలించనున్నారని సమాచారం.
Please Read Disclaimer