డర్టీపిక్చర్ చేస్తున్నానంటే పిచ్చా అన్నారు

0

విలక్షణ నటిగా విద్యాబాలన్ ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలన్ నటించిన `శకుంతలాదేవి` చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాయికా ప్రధాన చిత్రం కావడంతో ఈ మూవీ మహిళామణుల్ని బాగానే ఆకర్షిస్తోంది. క్రిటిక్స్ నుంచి చక్కని పాజిటివ్ సమీక్షలు దక్కాయి. తన సినిమాకి బాలన్ ప్రమోషన్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.

ఆ క్రమంలోనే బాలన్ నటించిన డర్టీ పిక్చర్ ఎంపిక గురించి మీడియా ప్రశ్నిస్తే .. షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. “మిలన్ లుథ్రియా తెరకెక్కించిన `ది డర్టీ పిక్చర్`కి సంతకం చేసినప్పుడు అంతా తనకు `పిచ్చి` అని భావించారని.. పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉన్న తనకు ఆ పాత్ర ఎలా సూటవుతుందని ప్రశ్నించార“ని తెలిపింది. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తన మార్గానికి వ్యతిరేకించలేదని.. నీకేమనిపిస్తే అది చేయమని ప్రోత్సహించారని వెల్లడించింది.

డర్టీ పిక్చర్ అవకాశం విషయంలో తనకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని బాలన్ చెప్పారు. ఏక్తా కపూర్ తనని ఎంపిక చేసుకోవడం వెనక నటవారసత్వానికి సంబంధించిన ఎలాంటి రిజర్వేషన్ లేదన్నది తన ఉద్ధేశం. దర్శకుడు సహా ఏక్త తనపై నమ్మకం ఉంచడం వల్లనే ఈ ఆఫర్ అందుకోగలిగిందట. ఏది సరైనదో అది చేయమని తనకు తల్లిదండ్రులు సూచించడం వల్ల కూడా ఈ సినిమా చేయగలిగానని తెలిపింది.

వివాదాస్పద ఐటెమ్ గాళ్ సిల్క్ స్మిత సెమీ బయోపిక్ కథతో ది డర్టీ పిక్చర్ తెరకెక్కింది. ఒక చిన్న పట్టణం నుంచి రంగుల ప్రపంచంలో ప్రవేశించిన సిల్కుస్మిత తాను అనుకున్నది సాధించేందుకు ఏం చేసేందుకైనా వెనకాడలేదన్న థీమ్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక బాలన్ హావభావాలకు కుర్రకారుకు మతులు చెడిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఆవిరులు పుట్టించిన బాలన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డే దిగొచ్చింది. 2011 లో వచ్చిన డర్టీ పిక్చర్ లో ఇమ్రాన్ హష్మి- తుషార్ కపూర్- నసీరుద్దీన్ షా కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.