త్రిష.. షి ఈజ్ బ్యాక్ !

0



త్రిష మనసు హారర్ సినిమాలపై మళ్లింది. నాయకి పేరుతో ఇటీవలే హారర్ కామెడీ చేసి ఫ్లాప్ను చవిచూసిన త్రిష హారర్ జెనర్తో అయినా హిట్టు కొట్టేయాలని ఆలోచిస్తున్నట్టు అర్థం అవుతుంది. సినిమా కథల్లో ఎప్పటికీ మారని జానర్ ఏదైనా ఉందంటే… అది హారరే. ఏ జనరేషన్లో అయినా హారర్ సినిమాలది అందె వేసిన చేయి. ఇపుడు టెక్నాలజీ వల్ల జనాల్ని మరింతగా భయపెట్టే అవకాశం కూడా ఉంది. అందుకేనేమో జనాల్ని గట్టిగా భయపెట్టేందుకు త్రిష రెడీ అయినట్టుంది.

తాజాగా హారర్ థ్రిల్లింగ్ కథతో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మోహిని’ కొత్త బజ్ క్రియేట్ చేస్తోంది. పి మాదేష్ దర్శకుడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రివెంజ్ హారర్ తో అరుంధతి బ్రహ్మాండంగా తెరకెక్కి అప్పట్లో బ్లాక్ బస్టర్ ను నమోదు చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇది కూడా రివెంజ్ హారర్ లాంటిదే అనిపిస్తోంది.

‘‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చిపెట్టబడిన నిజం..’’ డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 2 నిమిషాలకు పైగా సాగే ఈ ట్రైలర్ చూస్తుంటే.. సినిమా నిర్మాణంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదన్న విషయం తెలుస్తోంది. సాధారణంగా హారర్ సినిమాలు స్థానిక నేపథ్యంలో రూపొందిస్తుంటారు. కానీ మోహిని దేశ విదేశాలు తిరిగింది. నయగరాకు కూడా వెళ్లి భయపెట్టింది. సముద్రపు అడుగున చాలా ఏళ్ల నుంచి పగతో రగిలి పోతున్న వ్యక్తి అస్తిపంజరంలోకి ఒక వ్యక్తి రక్తపు బొట్టు పడటంతో అది ప్రేతాత్మ జీవంతో మళ్లీ పైకి లేచినట్లు చూపించారు. మరి ఆ పాత్ర త్రిష పోషించినదేనా- లేదా అది ఇంకోపాత్రనా అన్నది దాచారు. హారర్ లో తమిళ స్టైల్ కామెడీని కూడా చేర్చినట్టుంది. ఏదేమైనా గ్రాండ్ విజువల్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ అనంతరం అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. ఇంకా షూటింగ్ కొనసాగుతోంది.