బాలీవుడ్లో ఒక గొప్ప సినిమా

0చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన వ్యక్తులు.. ఉదంతాల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలు అద్భుతమైన ఫలితాలందుకుంటున్నాయి కొన్నేళ్లుగా. ఫోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో ఇటీవలే వచ్చిన ‘పర్మాణు’ కూడా మంచి విజయాన్నందుకుంది. ఈ కోవలోనే హిందీలో మరో స్ఫూర్తిదాయక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భాగంగా ‘బ్యాటిల్ ఆఫ్ బసంత్ పూర్’గా చెప్పుకున్న ఉదంతంలో అరుణ్ ప్రాణాలు వదిలాడు. ఆయనకు సైన్యంలో అత్యున్నత పురస్కారం అయిన పరమవీరచక్ర ప్రకటించారు. ఆ యుద్ధంలో అరుణ్ గొప్పగా పోరాడి.. శత్రువుల చేతిలో ప్రాణాలు వదిలాడు.

బ్యాటిల్ ఆఫ్ బసంత్ పూర్ గురించి చరిత్రకారులు చాలా గొప్పగా చెబుతారు. దాదాపు సమాన సైన్యంతో పోరాడినప్పటికీ భారత్ ఈ పోరులో పైచేయి సాధించింది. శత్రువులకు భారీ నష్టం చేకూర్చి వారిపై పైచేయి సాధించింది. స్ఫూర్తిదాయకమైన ఈ ఉదంతం నేపథ్యంలో అరుణ్ ఖేతర్పాల్ కథను చెప్పబోతున్నాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ఇంతకుముందు అతను ‘బద్లాపూర్’ లాంటి ఇంటెన్స్ యాక్షన్ మూవీ తీశాడు. దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. అరుణ్ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా వెల్లడి కాలేదు. అక్షయ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధింది అధికారిక ప్రకటన రానుంది. సరిగ్గా తెరకెక్కిస్తే ఇది గొప్ప సినిమా అవుతుందని భావిస్తున్నారు.