100 కోట్ల క్లబ్ కోసం సినిమాలు చేయను

0

ఒక కథ ఎంచుకోవడానికి ప్రాతపదిక ఏది? అంటే ఏ హీరో అయినా కన్ఫామ్ గా చెప్పేది `వినోదం పంచేందుకు మాత్రమే`నని. కానీ ఆ పని చేయడంలోనే ఎందరు సక్సెసవుతున్నారు? అన్నది ఇంపార్టెంట్. ఎలాంటి కథను ఎంచుకుంటే అది జనాలకు కనెక్టవుతుంది? అన్నది హీరో అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కహోనా ప్యార్ హై లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ తో కెరీర్ జర్నీ ప్రారంభించిన హృతిక్ రోషన్ దాదాపు రెండు దశాబ్ధాల పాటు అగ్ర కథానాయకుడి హోదాని కొనసాగిస్తున్నారు. గుజారిష్- కాబిల్- సూపర్ 30 లాంటి విలక్షణమైన సినిమాల్లో నటించి నటుడిగా తన స్థాయిని ఆవిష్కరించుకున్నారు. క్రిష్ సిరీస్ తో ఇండియన్ సూపర్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడంలోనూ అతడు సత్తా చాటారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించి మెప్పించిన స్టార్ గా అతడి కంటూ ప్రత్యేకత ఉంది. ఎంపికల పరంగా హృతిక్ ఏ ఇతర స్టార్ తో పోల్చినా డిఫరెంట్ అని అంగీకరించాలి.

అందుకే అతడు ఓ మాటను అనుభవంతో చెబుతున్నారు కాబట్టి నేటి తరం స్టార్లు విని తీరాల్సిందే. అసలు సూపర్ 30 అనే సినిమాని సందేశం కోసమే ఎంచుకున్నారా? అని హృతిక్ ని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం స్ఫూర్తిని నింపింది. “సామాజిక సందేశం ఇవ్వాలని ఈ చిత్రంలో నటించలేదు. గొప్ప కథ కాబట్టి నటించాను. సందేశాలివ్వాలని అనుకుంటే సినిమాలు వద్దు.. డాక్యుమెంటరీలు చేసుకో అని నాన్న అన్నారు!“ అంటూ చాలా సింపుల్ గా ఉన్న సంగతిని చెప్పారు. సంఘాన్ని ఉద్దరించేందుకే సినిమా తీస్తున్నామని .. సందేశాలిస్తున్నామని చెప్పేవాళ్లందరికీ ఇదో బిగ్ పంచ్ అనే చెప్పాలి.

అంతేకాదు.. ఒక కథను ఎంచుకునే ముందు ఇది 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా? ఎంత వసూలు చేస్తుంది? అంటూ లెక్కలు వేసుకుని ఎంపిక చేసుకోను అని హృతిక్ తెలిపారు. అతడు నటించిన సూపర్ 30 దాదాపు రూ.146కోట్ల వసూళ్లతో.. ఈ ఏడాది టాప్ 10 బ్లాక్ బస్టర్లలో ఒకటిగా చోటు సంపాదించుకుంది. అయితే తాను ఏదైనా సినిమాలో నటించాలి అనుకున్నప్పుడు అస్సలు బాక్సాఫీస్ వసూళ్ల గురించి ఆలోచించనని .. కలెక్షన్స్ ను బట్టి ఎందరు ప్రజలకు చేరువైందో అర్థం చేసుకుంటానని తెలిపారు. 100 కోట్లు తెస్తుందా లేదా? అన్నది చూడనని తెలిపారు. 100 కోట్లు రాబట్టడం అనేది కేక్ పై ఉన్న అందమైన చెర్రీలాంటిది. దానికంటే ప్రేక్షకుల్ని రంజింపజేశామా లేదా? అన్నదే నాకు ముఖ్యం అని అన్నారు. ఎన్నో ఓటముల నుంచి నేర్చుకుని రాటు దేలి నేడు ఎంతో కాన్ఫిడెన్స్ తో కథల్ని ఎంచుకుంటున్నానని హృతిక్ తెలిపారు.
Please Read Disclaimer