ప్రీవిజువలైజేషన్ కోసమే అన్ని కోట్లు పెట్టారంటే!

0

హాలీవుడ్ లో భారీ చిత్రాల్ని తెరకెక్కించే ముందు యానిమేషన్ విజువల్స్ ని క్రియేట్ చేయడం సహజమే. భారీగా క్యారికేచర్లు వేసి క్యారెక్టర్ల డ్రాయింగ్స్ ని పక్కాగా స్టోరీబోర్డ్ ని సిద్ధం చేసుకుని వాటిని యానిమేషన్ లో మూవ్ మెంట్స్ ఇచ్చి.. ప్రీవిజువలైజేషన్ కోసమే చాలా ఖర్చు చేస్తుంటారు. ఫలానా పాత్ర ఇలా మూవ్ అవుతుంది.. ఫలానా విలన్ పాత్రలో ఇంత డెప్త్ ఉంటుంది. హీరో పాత్ర చిత్రణ ఇలా ఉండాలి!! అన్నది ముందే క్లారిటీ వచ్చేస్తుంది ఈ విజువలైజేషన్ తో. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలకు ఇదే ఫార్ములాను అనుసరించారు. అప్పట్లో క్రిష్ 3 చిత్రీకరణ కోసం రాకేష్ రోషన్ బృందం ఇలానే ప్రీవిజువలైజేషన్ చేసిన సంగతి విధితమే. యానిమేషన్ బొమ్మలు.. వాటితో ప్రీవిజువలైజేషన్ కోసమే చాలా ఖర్చు చేశారు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ కోసం రాజమౌళి ఇలాంటి సాహసాలెన్నో చేశారు. ఇప్పుడు అదే బాటలో దగ్గుబాటి రానా నటించనున్న `హిరణ్యకశిప` కోసం చాలానే రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా డి.సురేష్ బాబు-గుణశేఖర్ బృందం పలు కార్పొరెట్ దిగ్గజాలను కలుపుకుని ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

ఇంకా సెట్స్ కి వెళ్లకముందే హిరణ్యకశిప కోసం ఎంతగా రిస్క్ చేస్తున్నారో తెలిసినదే. ఈ మూవీ ప్రీవిజువల్స్ కోసమే మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారు. దేశవిదేశాల్లో యానిమేషన్ లో క్యారెక్టర్ డిజైనింగుకి సంబంధించిన వర్క్ చేశారు. రామానాయుడు స్టూడియోస్ లో యానిమేషన్ వింగ్ సహా గుణశేఖర్ టెక్నీషియన్స్ విదేశీ టెక్నీషియన్లతో కలిసి పని చేస్తున్నారు. ఈ పనుల కోసం డి.సురేష్ బాబు భారీగా ల్యాబులనే రన్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ దిగ్గజాలంతా తలలు తిప్పి ఇటువైపు చూసే రేంజులోనే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రానా టైటిల్ రోల్ పోషించనుండగా.. బాల నటుడిని ఎంపిక చేయాల్సి ఉందిట. సాధ్యమైనంత భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. అందుకే ప్రఖ్యాత ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో సంప్రదింపులు సాగించారని తెలిసింది. గుణశేఖర్ ఇప్పటికే తన బృందంతో కలిసి సర్వ శక్తులన్నింటినీ సినిమాపై పెడుతున్నాడు. నెవ్వర్ బిఫోర్ అనేంతగా.. ఒక అసాధారణ దృశ్యకావ్యంలా తెరకెక్కించాలన్నదే వీళ్లందరి సంకల్పం. ప్రస్తుతం హిరణ్యకశిప ప్రీ-విజువలైజేషన్ శరవేగంగా సాగుతోంది. కేవలం దీనికోసమే ఏకంగా 15 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది.

ఇంకా సెట్స్ కి వెళ్లకుండానే ఒక్క షాట్ అయినా తీయకుండానే అంత ఖర్చు చేశారా? అంటూ నోరెళ్లబెట్టేస్తున్నారట తెలిసిన వాళ్లు. హిరణ్యకశిప బహుభాషా చిత్రం. నటీనటుల ఎంపికా సాగుతోంది. షూటింగ్ ప్రారంభించాలంటే కాస్త పరిస్థితులు మెరుగుపడాల్సి ఉంది. రుద్రమదేవి తర్వాత నాలుగైదేళ్లుగా గుణశేఖర్ ఈ మూవీ కోసమే పని చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Please Read Disclaimer