బన్నీకి సంక్రాంతి గిఫ్ట్ పంపిన రౌడీ

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర శ్రేణి వ్యాపారం చేస్తోన్న సంగతి తెలిసిందే. యూత్ ని ఆకర్షిస్తూ.. ట్రెండీ డిజైన్స్ ని పరిచయం చేస్తూ రౌడీ బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అభిమానులు ఆపాదించిన ఇమేజ్ నే బట్టల షాపు బిజినెస్ కు అనువుగా మలుచుకుని వీలైనంతగా ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సహా పలు పట్టణాల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఇక విజయ్ తనకు ఇష్టమైన సెలబ్రిటిలకు ప్రత్యేకంగా డిజైనర్ డ్రెస్ లను బహుమతిగా పంపిస్తూ అభిమానం చాటుకోవడం అలవాటు. అదీ ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడంతో ఈసారి రౌడీ స్టార్ బట్టలకి మరింత గీరాకీ వచ్చింది.

లేటెస్టుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి విజయ్ సంక్రాంతి కానుకను పంపించాడు. ఏమిటా కానుక అంటే.. సర్ ప్రైజ్ ఉందట. తన షాపు నుంచి రౌడీ బ్రాండ్ టీషర్టులను బహుమతిగా పంపించాడట. ఆ విషయాన్ని విజయ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించగా బన్నీ థాంక్స్ చెబుతూ రిప్లయ్ ఇచ్చాడు. థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ విజయ్. నీ బహుమతులు చాలా బాగున్నాయి. అల వైకుంఠపురములో సక్సెస్ మీట్ లో ఇవే ధరిస్తానని రిప్లయ్ ఇచ్చాడు బన్నీ. స్టైలిష్ స్టార్ నటించిన అల వైకుంఠపురములో ఆదివారం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నా పేరు సూర్య తర్వాత బన్ని నటించిన చిత్రమిది. ఆ సినిమా పరాజయం నేపథ్యంలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ సక్సెస్ పై యూనిట్ ధీమాగా ఉంది.

ఇక విజయ్ దేవరకొండకు నిర్మాత అల్లు అరవింద్ సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఠఫ్ కాంపిటీషన్ ఉన్న ఈ పరిశ్రమలో విజయ్ కెరీర్ గ్రాఫ్ పెంచే అద్భుతమైన హిట్ చిత్రాన్ని అందించారు. విజయ్ నటుడిగా నిరూపించుకున్న తర్వాత అరవింద్ అతన్ని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. జీఏ2 బ్యానర్ లో గీతగోవిందం రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ల రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయింది. విజయ్ ని ప్రత్యర్థులు ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. ముందు తాను అడ్డుగోడగా నిలుస్తానని అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer