AA20 ముహూర్తం.. బన్ని వర్సెస్ సేతుపతి!

0

ఆర్య కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి. బన్ని – సుకుమార్ కాంబినేషన్ యువతరంలో ఆల్వేస్ హాట్ టాపిక్. ఈ క్రేజీ కాంబినేషన్ ఆర్య- ఆర్య 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు హ్యాట్రిక్ మూవీ నేడు హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. ‘సైరా’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ప్రతుల్ని దర్శకనిర్మాతలకు అందజేయగా.. కొరటాల శివ గౌరవదర్శకత్వం వహించాడు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ క్లాప్ ని ఇచ్చారు. ప్రస్తుతానికి టైటిల్ ని నిర్ణయించలేదు. AA20 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ సాగనుంది. బన్ని సరసన ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయిక. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

దేవీశ్రీ ప్రసాద్ మరోసారి ఆర్య తరహా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని అందించేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ డైలమా గురించి తెలిసిందే. చరణ్ తర్వాత మహేష్ తో సినిమా చేయాలని భావించినా అది క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆగిపోయింది. ఆ క్రమంలోనే బన్నికి కథ చెప్పి ఒప్పించిన సుకుమార్ ఎట్టకేలకు ప్రారంభోత్సవంతో జేగంట మోగించాడు. ఈ సినిమా కోసం సుకుమార్ రెండేళ్లుగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ తో పాటుగా ప్యారలల్ గా దేవీశ్రీతో మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా టైమ్ స్పెండ్ చేశాడు.

ఏఏ20 కథాంశం ఆసక్తికరం. ఎర్రచందనం స్మగ్లింగ్ .. చిత్తూరు యాస నేపథ్యంలో సుక్కూ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశాన్ని ఎంచుకున్నారు. ఇందులో బన్ని ఓ విభిన్నమైన గెటప్ తో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. రజనీ పేట చిత్రంలో విలన్ గా నటించిన సేతుపతి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో కీలకపాత్రతో ఆకట్టుకున్నాడు. దళపతి 64లో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ప్రస్తుతం బన్ని సినిమాలోనూ విలన్ పాత్రలో నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఇతర కాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.




Please Read Disclaimer