భారతరత్న పాత్రలో సీనియర్ స్టార్ కమెడియన్

0

టాలీవుడ్ లో వెయ్యికి పైగా చిత్రాలు చేసిన నటీనటులు అతి తక్కువ మంది ఉంటారు. వారిలో కమెడియన్ అలీ ఒకరు. ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించి నవ్వులు పూయించిన నటుడు అలీ. హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో కామెడీ విలన్గా ఇలా పలు సినిమాల్లో నటించిన అలీ ఇప్పుడు భారత రత్న ఏపీజే అబ్దుల్ కాలం పాత్రలో కనిపించబోతున్నారు. మాజీ రాష్ట్రపతి.. మిసైల్ మెన్ భారత దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త విద్యావేత్త అద్బుతమైన వ్యక్త అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో కలాం పాత్రకు గాను అలీని ఎంపిక చేయడం జరిగింది.

కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ‘డా. కలామ్’ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని జగదీష్ దనేటి తెరకెక్కించబోతున్నారు. కలాం జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నారు. ఇప్పటి వరకు కలాం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వాటన్నింటిని క్షుణంగా స్టడీ చేసి కీలక విషయాలను ఆయన సన్నిహితులు చెప్పిన విషయాలను క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారట.

ఆదర్శమూర్తి అయిన కలామ్ జీవిత చరిత్ర అందరికి తెలియాలని ప్రతి ఒక్కరు అడుగు జాడల్లో నడవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తీస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం చేసి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలీ ఖచ్చితంగా కలామ్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.