బౌలర్ బయోపిక్ ‘800’

0

ఈమద్య కాలంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. క్రికెటర్స్ బయోపిక్స్ మరియు సినీ స్టార్స్ బయోపిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మరిన్ని బయోపిక్ లు రాబోతున్నాయి. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కు తమిళ స్టార్ ఫిల్మ్ మేకర్ రెడీ అవుతున్నాడు. గత ఏడాది కాలంగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. చివరకు ఈ బయోపిక్ కు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ముత్తయ్య మురళీధరన్ పాత్రకు విజయ్ సేతుపతి అయితే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన ఓకే అనే వరకు వెయిట్ చేశారు. ఇటీవలే స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ఓకే చెప్పాడు. ప్రస్తుతం ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ వీడియోలు చూస్తూ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడట. అంతర్జాతీయ క్రికెట్ లో మరెవ్వరికి సాధ్యం కాని 800 వికెట్లను తీసిన ఆయన జీవిత చరిత్రను అన్ని భాషల్లో కూడా చూపించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ బయోపిక్ కు 800 అనే టైటిల్ ను ఖరారు చేశారట. తమిళ సినీ వర్గాల్లో ఈ విషయమై చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముత్తయ్య మురళీధరన్ ఈ బయోపిక్ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడట. హిందీలో కూడా ఈ బయోపిక్ ను విడుదల చేయాలంటూ ఆయన కోరుకుంటున్నాడట. త్వరలో ఈ బయోపిక్ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందట.