కృష్ణ – విజయనిర్మల పెళ్లికి మేం నలుగురం సాక్షులం

0

నటి.. దర్శకురాలు.. నిర్మాత అయిన విజయ నిర్మల అనారోగ్య కారణంతో నేడు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. విజయ నిర్మల గారు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ కోసం చాలా సాయం చేశారు. ఇంకా ఎంతో మందికి కూడా ఆమె లేదనకుండా కాదనకుండా సాయం చేశారు. ఇప్పుడు వారంతా కూడా ఆమె మరణంతో దుఖంలో మునిగి పోయారు. విజయ నిర్మల అన్నయ్యగా భావించే ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఆమె మరణం గురించి మీడియాతో మాట్లాడుతూ తన బాధను పంచుకున్నాడు.

విజయ నిర్మల గారు నేను కలిసి మొదటి సారిగా ‘రంగులరట్నం’ చిత్రంలో నటించాం. ఆ చిత్రంలో నాకు చెల్లిగా విజయ నిర్మల నటించింది. అప్పటి నుండి కూడా ఆమెను నేను నా సొంత చెల్లిగా భావించేవాడిని. ఆమె కూడా నన్ను సొంత అన్నగా భావించి సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా మెలిగేవాళ్లం. విజయ నిర్మల గారు స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో నేను కాని కృష్ణ గారు కాని మాత్రమే నటించే వాళ్లం. కృష్ణ గారు బిజీగా ఉన్న సమయంలో నాతో విజయ సినిమాలు తీసేది. ఇక విజయ నిర్మల దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను నటించాను. ప్రతి సినిమాలో కూడా నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చింది.

ఫిల్మ్ నగర్ లో ఇద్దరం కూడా ఎదురు ఎదురుగా ఇళ్లు తీసుకున్నాం. తరుచు వారింటికి వెళ్తూ ఉండే వాళ్లం. విజయ నిర్మల మరియు కృష్ణ గారు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు చెప్పారు. నేను కృష్ణ గారి మేకప్ మన్.. విజయ నిర్మల అసిస్టెంట్ ఇంకా మోహన్ కృష్ణ అనే జర్నలిస్ట్ కలిసి తిరుపతిలో వారి పెళ్లి చేశాం. వారి పెళ్లికి మేము నలుగురం మాత్రమే సాక్షులం. కృష్ణ మరియు విజయ నిర్మలల పెళ్లికి ముందు ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవాలనుకుంటే నా బ్యాచులర్ రూంకు వచ్చే వారు. నాకు కృష్ణ గారు విజయ నిర్మల అప్పటి నుండి చాలా క్లోజ్. నేను ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాను.. హీరోలతో కలిసి చేశాను కాని వీరిద్దరితో ఉన్నంత సన్నిహిత్యం ఎవరితో లేదని అన్నాడు. అలాంటి వ్యక్తి మరణం నాకు తీరని శోఖంను మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్నారు.
Please Read Disclaimer