ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా

0

తితిదే అనుబంధ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. ఇదే ఛానల్‌లో పనిచేసే ఓ ఉద్యోగినితో అనుచితంగా మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతం కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పదవికి రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఆదివారం రాత్రి ఆయన పదవి నుంచి తప్పుకొన్నారు. ఉద్యోగినితో ఫోన్‌లో మాట్లాడటంతోపాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ పృథ్వీరాజ్‌పై ఎంప్లాయీస్‌ యూనియన్‌ కొన్ని ఆడియో టేపులను ఆదివారం తిరుపతిలో బహిర్గతం చేసింది. వీటిపై మహిళా సంఘాలు, పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. విచారించాలని తితిదే పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించారు. వారి నుంచి అందిన సమాచారం మేరకు సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. తీవ్రంగా స్పందించిన సీఎం.. తక్షణమే ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

నేను ఏ తప్పూ చేయలేదు

తాను ఏ తప్పూ చేయలేదని, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. తాను అమరావతిలో మాట్లాడిన అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని, తాను పెయిడ్‌ ఆర్టిస్టులని విమర్శించింది రైతుల ముసుగులో ఉన్న కార్పొరేట్‌ వ్యక్తుల గురించేనని చెప్పారు. నిజమైన రైతులను కించపరిచే కుసంస్కారం తనది కాదని వివరించారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని కోరారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా మాట్లాడకూడదనే రాజీనామాను ఫ్యాక్స్‌ ద్వారా పంపించి ఆ తర్వాతే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న అందరినీ కడిగి పారేస్తానన్నారు. తాను పద్మావతి అతిథిగృహంలో మద్యం తాగానని ఆరోపిస్తున్నారని, అవసరమైతే రక్తాన్ని పరీక్షించి వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడానన్న ఆరోపణలను ఖండించారు. అది తన గొంతు కాదని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. తాను మాట్లాడానని రుజువైతే చెప్పుతో కొట్టండని పాదరక్షను చూపారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-