మూడు ముక్కలాటలో స్పెషలిస్టులు!

0

దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవడం ఎలానో మన చక్కనమ్మలు ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. కథానాయికగా క్రేజు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే కాదు.. నేము ఫేము ఉన్నప్పుడే తెలివిగా మూడు నాలుగు భాషల్లో గేమ్ ఆడేస్తున్నారు. సౌత్ నాలుగు భాషలు.. హిందీ లో నటించేస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఆ కోవలో ప్రముఖంగా ఎందరు కథానాయికలు ట్రెండింగ్ లో ఉన్నారు? అన్నది పరిశీలిస్తే ఓ డజను పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.

తాప్సీ – కాజల్ – త్రిష – తమన్నా – కీర్తి సురేష్ – శ్రుతిహాసన్ -రకుల్ ప్రీత్ – అదితీ రావ్ హైదరీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లంతా రెగ్యులర్ గా మూడు నాలుగు భాషల్లో సంతకాలు చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. అన్ని వైపుల నుంచి తమవైపు వచ్చే ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా కెరీర్ ని సాగిస్తున్నారు. సౌత్ లో చతికిలబడినా ఆ తర్వాత బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న తాప్సీ అనూహ్యంగా గేమ్ ప్లాన్ మార్చి తిరిగి సౌతిండస్ట్రీపైనా పట్టు బిగించాలని చూస్తోంది. ఆ క్రమంలోనే ద్విభాషా త్రిభాషా చిత్రాల్లో నటిస్తోంది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాల్ని ఎంచుకుంటూ . నాయికా ప్రాధాన్య పాత్రలతో చెలరేగుతోంది. నేడు తాప్సీ నటించిన గేమ్ ఓవర్ తెలుగు- తమిళంలో రిలీజైంది. తాప్సీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ భామ త్వరలో కన్నడ- మలయాళంపైనా దృష్టి సారించనుందట.

మరో యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గేమ్ ప్లాన్ గురించి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్టందుకుని టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోయిన రకుల్ అటుపై తమిళం- హిందీ చిత్రాలకు సంతకాలు చేస్తూ కెరీర్ ని తెలివిగా విస్తరించింది. ఆ మూడు భాషల్లో రకుల్ ప్రీత్ కి ఏమాత్రం డోఖా అన్నదే లేదు. దేదే ప్యార్ దే సక్సెస్ తర్వాత రకుల్ కి భారీ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయట. మరోవైపు తెలుగు- తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ స్టార్ గా వెలిగిపోతోంది. అదితీరావ్ హైదరీ తొలుత బాలీవుడ్ లో పాపులరై సౌత్ లో అడుగు పెట్టింది. వస్తూనే మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాల్లో నటించి హాట్ టాపిక్ అయ్యింది. అదితీ టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ నాయికగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హిందీ- తెలుగు- తమిళంలో అదితీ దూసుకుపోతోంది. ఇరుగు పొరుగు భాషల్లోనూ నటించే ప్రణాళికలు వేస్తోందట. మహానటిగా సౌత్ – నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగు- తమిళం – మలయాళం మూడు భాషల్లోనూ ఈ అమ్మడు పాపులర్.

ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ లాంటి స్టార్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మూడు నాలుగు చోట్ల అనూహ్యంగా గేమ్ ప్లాన్ చేస్తోంది కీర్తి. చందమామ కాజల్ ఆల్వేస్ హాట్. ముంబై టు హైదరాబాద్ – చెన్నయ్ ఎక్కడికి వెళ్లినా ఆఫర్ రెడీగా ఉంటోంది. అటు బాలీవుడ్ సినిమాలకు వీలున్నప్పుడల్లా సంతకాలు చేసేందుకు రెడీగా ఉంటోంది. ఇటు సౌత్ లోనూ తెలుగు- తమిళంలో తెలివైన గేమ్ ప్లాన్ తో కెరీర్ బండిని నడిపిస్తోంది. తీరిక లేకుండా బండిని నడిపించేయడంలో కాజల్ కి తిరుగేలేదని చెప్పాలి.

తమన్నా – శ్రీయ -త్రిష- శ్రుతిహాసన్ వీళ్లు కాస్తంత సీనియర్లు. పై ముగ్గురు భామలతో పోలిస్తే దక్షిణాది – ఉత్తరాది అన్న తేడా లేకుండా వీలున్న చోటల్లా నటించేసేందుకు సిద్దంగా ఉంటారు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓవైపు సౌత్ లో హవా సాగిస్తూనే నార్త్ పై కన్నేసి ఉంచుతోంది. ఇక్కడా అక్కడా వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ అన్నదే లేకుండా ఓ ఆటాడుకుంటోంది. శ్రీయ అవకాశాన్ని బట్టి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తుంది. ఇటీవల సౌత్ లో ఛాన్సులు తగ్గాయి. ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యతనిచ్చి సినిమాల్ని తగ్గించుకుంది అమ్మడు. తిరిగి రీఎంట్రీ అదరగొట్టే ప్లాన్ లో ఉందట. శ్రుతి హాసన్ సన్నివేశం తెలిసిందే. సౌత్ – నార్త్ రెండుచోట్లా కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం ఇంపార్టెంట్ అంటూ గ్యాప్ తీస్కుంది. ఇక రకరకాల సన్నివేశాల తర్వాత ప్రియుడితో బ్రేకప్ అయ్యి ఇప్పుడు తిరిగి కెరీర్ గురించే ఆలోచిస్తోంది. ఇప్పటికే రెండు దక్షిణాది సినిమాలతో బిజీ. బాలీవుడ్ లోనూ బిజీ అయ్యేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇక సీనియర్ బ్యూటీ త్రిష సన్నివేశం వేరు. సౌత్ లో కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న క్రమంలో బాలీవుడ్ లో ట్రై చేసింది. కానీ అక్కడ ఆశించిన కెరీర్ దక్కలేదు. అయినా తిరిగి సౌత్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి నాయికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు- తమిళం- హిందీ- కన్నడ భాషల్లో త్రిషకు పాపులారిటీ ఉంది. ఇలా పరిశీలిస్తే పలువురు భామలు ఇరుగు పొరుగు పరిశ్రమల్లో రాణిస్తున్నారు. మెజారిటీ పార్ట్ అందాల కథానాయికలు తెలుగు-తమిళం వరకూ ఫేమస్.