‘మేజర్’ ఫస్ట్ థియేటర్స్ లో.. ఆ తర్వాత ఓటీటీలో…!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘మేజర్’ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ మధ్య షూటింగులకు అనుమతులు లభించడంతో గత ఆరు నెలలుగా ఆగిపోయిన ‘మేజర్’ చిత్రీకరణ తిరిగి ప్రారంభించారని తెలుస్తోంది.

హీరో అడవి శేష్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర షూటింగ్ లో వారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించారు. తనతో పాటు షూట్ లో పాల్గొనే నటీనటులు సాంకేతిక నిపుణులు మరియు ఇతర సిబ్బందికి ప్రతిరోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్ జరుపుతున్నట్లు చెప్తూ.. షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత చిత్ర యూనిట్ లో ఎవరూ కూడా బయటకు వెళ్లడం లేదని పేర్కొన్నాడు. కాగా శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘మేజర్’ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్విట్టర్ చిట్ చాట్ లో పాల్గొన్న అడవి శేష్ ‘మేజర్’ సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశాడు.