‘ఆదిపురుష్’ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ‘డార్లింగ్’ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మిగతా ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర ‘సీత’ గా నటించబోయే హీరోయిన్ అంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ముందుగా సీత పాత్రలో ‘మహానటి’ కీర్తి సురేష్ మరియు కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. ఇటీవల మిస్ దివా యూనివర్స్ ఊర్వశి రౌతేలాను సీత పాత్ర కోసం సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ పుకార్లపై ‘ఆదిపురుష్’ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

‘ఆదిపురుష్’ సినిమాలో నటించే హీరోయిన్ గురించి వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించారు. ‘ఆదిపురుష్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు వస్తున్న కథనాలు నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి. అవాస్తవాలు’ అని స్పష్టం చేశారు. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని 3డీలో హిందీ తెలుగు భాషల్లో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఆదిపురుష్’ ని సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.