అనీల్ రావిపూడి మరో గుణశేఖర్?

0

`ఒక్కడు` మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గుణశేఖర్ వేయించిన సెట్స్ ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఒక్కడులో ఛార్మినార్ సెట్ టాలీవుడ్ హిస్టరీలోనే ప్రత్యేకమైన లావిష్ సెట్ అన్న చర్చ సాగింది. దీంతో పాటే కర్నూలు కొండారెడ్డి బురుజు లైవ్ లొకేషన్ లోనూ ఒక్కడుకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అప్పట్లో సెట్స్ కోసం గుణ భారీగా బడ్జెట్లు ఖర్చు చేయించారని ముచ్చటించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ తరహాలోనే అనీల్ రావిపూడి ఓ భారీ సెట్ వేయిస్తున్నాడట. మహేష్ – అనీల్ రావిపూడి కాంబినేషన్ మూవీ `సరిలేరు నీకెవ్వరు` కోసం ఈ ఫీట్ వేస్తున్నారని తెలుస్తోంది.

కర్నూలు కొండా రెడ్డి బురుజు పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాల్సి ఉండగా.. ఈసారి లైవ్ లొకేషన్ కి వెళ్లడం కుదరలేదట. అందుకే రామోజీ ఫిలింసిటీలో ఈ లొకేషన్ ని సెట్స్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక రియల్ లొకేషన్ ని సెట్స్ లో క్రియేట్ చేయడం అంటే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. బురుజు సెట్ కోసం దాదాపు 4కోట్ల మేర వెచ్చించనున్నారని తెలుస్తోంది. కొండారెడ్డి బురుజు.. ఆ చుట్టు పక్కల పరిసరాల్లో ఉండే వీధుల్ని సెట్స్ లో క్రియేట్ చేస్తారట. ప్రస్తుతం మహేష్ కర్నూల్లో ఉన్నారు. అక్కడ కొండారెడ్డి బురుజు లైవ్ లొకేషన్ వద్ద కొన్ని షాట్లు చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఇప్పటికే పలు చోట్ల భారీ సెట్లు వేస్తున్నారన్న సమాచారం ఉంది. కొండారెడ్డి బురుజు సెట్ తో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైన్ సెట్ ని భారీ పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రధారి విజయశాంతి పై చిత్రీకరించే సీన్స్ కోసం ఒక భారీ ఇల్లు సెట్ ని నిర్మిస్తున్నారన్న సమాచారం ఉంది. మొత్తానికి అనీల్ రావిపూడి సైతం గుణశేఖర్ లా భారీ సెట్స్ వేయిస్తున్నారనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయిక. నవంబర్ నాటికి చిత్రీకరణ ముగిస్తారు. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer