ఆహా.. శత్రువులకే పొగ పెట్టడమెలా!

0

జనం ఎక్కువగా ఆదరించేది ఏది? దానినే కొనేసి అందిస్తే.. మంచి ఆలోచనే. కాంపిటీటివ్ రంగంలో ఇది చాలా అవసరం. ప్రస్తుతం అలాంటి ఎత్తుగడల్నే అనుసరిస్తున్నారట బాస్ అల్లు అరవింద్. పోటీ ఎంత ఉన్నా ఉత్తమమైన కంటెంట్ అందించడం ద్వారా `ఆహా- తెలుగు`ని పైకి లేపాలన్నది ఆయన ప్లాన్. అందుకోసం దిగ్గజాలతోనే పోటీపడేందుకు ప్లాన్ రెడీ చేశారట. వందల కోట్లు వెదజల్లితే సరిపోతుందా? మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా వెంటాడి వెతికి పట్టుకోవాలి. ఇక్కడికి తేవాలి. పైగా తెలుగులో అందించాలి. ఒరిజినల్ కంటెంట్ తో పాటు ఇరుగు పొరుగున ది బెస్ట్ ఏం ఉందో అదంతా ఇక్కడికి తేవాలి.

అమెజాన్ ప్రైమ్ .. నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంటెంట్ ని వెతికి తెస్తున్నాయి. పైగా వాటిని తెలుగు ప్రేక్షకులకు తెలుగులోనే చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. కనీసం తెలుగు సబ్ టైటిల్స్ తో అందిస్తున్నాయి. ఇది ఏకంగా వీక్షకుల మైండ్ సెట్ నే మార్చేస్తోంది. ఇంగ్లీష్- కొరియా- చైనా-మలయాళం-తమిళం-కన్నడం.. భాష ఏదైనా అక్కడ అత్యుత్తమమైన సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు వస్తే వాటిని తెలుగైజ్ చేసి అందించేందుకు పోటీపడుతున్నాయి. దీంతో ప్రైమ్ సహా నెట్ ఫ్లిక్స్ అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. ఇక ఈ దిగ్గజ సంస్థల ఒరిజినల్ కంటెంట్ (వెబ్ సిరీస్ లు సినిమాలు) అయితే అల్ట్రా రిచ్ విజువల్స్ తో బెస్ట్ విజువలైజేషన్ తో విశేష ఆదరణకు నోచుకుంటున్నాయి.

ఇక ఈ విషయంలో ఆహా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ప్రైమ్ అండ్ నెట్ ఫ్లిక్స్ ఎత్తుగడనే నమ్ముకుని ముందుకు వెళుతోంది. ఈ రెండు ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో కాస్త వ్యూయర్షిప్ ఎక్కువ ఉన్న తమిళ- కన్నడ- మలయాళీ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండడం లేటెస్ట్ స్ట్రాటజీ. తాజాగా `ఫోరెన్సిక్` అనే మలయాళీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో బాగా హిట్ అయ్యింది. అదే సినిమాను ఇప్పుడు `ఆహా` తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు. ఐతే నెట్ ఫ్లిక్స్ యాప్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికే ఈ సినిమాను చూసేసారు..! మరి తెలుగు దనం కోరుకునే ఆడియన్స్ కి ఆహా వారు అందిస్తున్న వెర్షన్ ఎంత వరకు ఎక్కు తుందో చూడాలి. ఇంతకీ `ఫోరెన్సిక్`ని తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారా?