Templates by BIGtheme NET
Home >> Cinema News >> డైరెక్ట్ ఓటీటీ రిలీజులలో మేటిగా నిలుస్తున్న ‘ఆహా’

డైరెక్ట్ ఓటీటీ రిలీజులలో మేటిగా నిలుస్తున్న ‘ఆహా’


కరోనా మహమ్మారి పుణ్యమా అని దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుంజుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. థియేటర్స్ మూతబడి ఉండటంతో కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్ లో సినిమాలు చూడాలనుకునే వారికి ఈ డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవుతున్న సినిమాలే దిక్కు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కొత్త డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వీక్షకులకు అందుబాటులో వచ్చాయి. భవిష్యత్ లో ఓటీటీల ప్రభావాన్ని ముందే ఊహించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశించారు. వంద శాతం తెలుగు యాప్ అంటూ ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసి తెలుగు సినిమాలను.. వెబ్ సిరీస్ లను.. కొన్ని కామెడీ షో లను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచింది ‘ఆహా’. ముఖ్యంగా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసిన సినిమాలతో ఈ యాప్ బాగా పుంజుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ప్రముఖ ఓటీటీలలో డైరెక్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ బ్యాడ్ టాక్ – నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. ఇదే సమయంలో ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇతర భాషల్లో హిట్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు.. తెలుగు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఈ యాప్ లో రిలీజవుతున్న సినిమాలకి ముందు బ్యాడ్ టాక్.. నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఆ తరువాత మెల్లిగా పుంజుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయిన ‘భానుమతి రామకృష్ణ’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాలు మంచి వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయి. అలానే ఇటీవల విడుదలైన ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమా ఆహాలో అత్యధిక వ్యూయర్ షిప్ తెచ్చుకుందని అంటున్నారు. ఇప్పుడు విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమా దాన్ని బీట్ చేసే రీతిలో సాగుతుందని ఓటీటీ వర్గాలు అంటున్నారు. ఇప్పటికే 40 వేల డౌన్ లోడ్స్ తో ముందుకు సాగుతుందని చెబుతున్నారు. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్న ఓటీటీ దిగ్గజాలకు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోంది.