బిజీగా ఉన్నా బిజినెస్ కోసం పోస్ట్ పెట్టాల్సిందే!

0

సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయటం ఇప్పుడేం కొత్త విషయం కాదు. కాకుంటే.. కొందరు సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. తమకు సంబంధించిన విశేషాల్ని తరచూ పోస్ట్ చేస్తుంటారు. యమా యాక్టివ్ గా ఉంటారు. మరికొందరు ప్రముఖులు మాత్రం ఆచితూచి అన్నట్లుగా పోస్టులు పెడుతుంటారు. ఇంకొందరు సెలబ్రిటీలు మాత్రం సెలెక్టివ్ గా పోస్టులు పెడుతుంటారు. వారు పెట్టే పోస్టులు చూస్తే.. అందులో ఏదో ఒక ఉద్దేశం కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు.

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కాస్త భిన్నం. నెలలో నాలుగైదు రోజుల పాటు వరుసగానో.. లేదంటే తనకు నచ్చినప్పుడో ఫోటోల్ని షేర్ చేసే ఆమె.. గడిచిన రెండు నెలలుగా మాత్రం ఒక్క స్టోరీ పోస్ట్ చేయలేదు. షూటింగ్ బిజీలో ఉన్నారో ఏమో. అలాంటిదామె మంగళవారం రాత్రి మాత్రం ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ముంబయిలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లో తన భర్త అభిషేక్ కు చెందిన జైపూర్ పింక్ పాంథర్ జట్టుగెలిచిన సందర్భంగా.. మ్యాచ్ లో అతగాడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు.

పింక్ పాంథర్స్.. గాడ్ బ్లెస్ అంటూ సింఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. ఐష్ స్టోరీకి అభిషేక్ రియాక్ట్ అయ్యారు.. ఐష్.. మా లక్కీ ఛార్మ్ అంటూ స్పందించారు. ఐష్ పెట్టిన పోస్ట్ కు గంటల వ్యవధిలోనే 2.50లక్షల మంది లైక్స్ కొట్టేశారు. సరిగ్గా రెండు నెలల క్రితం తన తల్లి ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత ఐష్ పెట్టిన పోస్ట్ ఇదే కావటం గమనార్హం.

వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా భర్త వ్యాపారానికి సంబంధించిన విషయంలో అప్డేట్ షేర్ చేయకుండా ఉంటారా? తన భర్త జట్టును ప్రమోట్ చేయాల్సి వచ్చినప్పుడు.. ఎంత ఐష్ అయినా సోషల్ మీడియాకు కాసింత టైం స్పెండ్ చేయక తప్పదు కదా!
Please Read Disclaimer