మరోసారి ప్రపంచాన్ని కాపాడబోతున్న అఖిల్!!

0

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను తెరకెక్కించేందుకు బొమ్మరిల్లు భాస్కర్ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడు. ఒక వైపు నాల్గవ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు అయిద సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తమిళ దర్శకుడు మిత్రన్ మరియు హీరో శివ కార్తికేయన్ లతో అఖిల్ డిన్నర్ సిట్టింగ్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అఖిల్ 5వ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించబోతున్నాడని.. శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించబోతున్నాడనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో అఖిల్ 5 చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒక సమస్య ప్రపంచాన్ని నాశనం చేయబోతూ ఉంటే దాన్నుండి కాపాడే సూపర్ హీరో పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడట.

అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ కూడా సూపర్ హీరో నేపథ్యమనే విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రపంచ వినాశనం నుండి హీరో కాపాడుతాడు. సూపర్ పవర్స్ ఉన్న హీరోగా అఖిల్ నటించాడు. ఇప్పుడు తన 5వ సినిమాలో కూడా అదే తరహా పాత్రను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రంపై అఖిల్ ఆసక్తిగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అఖిల్ 5 పట్టాలెక్కే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.