ఏడేళ్ల తర్వాత మళ్లీ..ఈసారైనా కంటిన్యూ చేసేనా?

0

మూడు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో హీరోయిన్ గా అలరించిన అమల ఒక సినిమా సమయంలో నాగార్జునతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని అక్కినేని అమలగా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించేసింది. తెలుగులో 1993 వ సంవత్సరంలో ఆగ్రహం అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ తర్వాత అమల అక్కినేని కంటిన్యూగా సినిమాలు చేస్తారని అంతా అనుకున్నారు. కాని ఆమె మళ్లీ బ్రేక్ తీసుకుంది. ‘మనం’ సినిమాలో కొన్ని సెకన్లు కనిపించి వెళ్లి పోయారు. లెక్క ప్రకారం 2012 తర్వాత అమల అక్కినేని సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక ద్విభాష చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోందట. శర్వానంద్ తల్లి పాత్రలో అమల నటిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ద్విభాష చిత్రంకు సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుందట. ఈ షెడ్యూల్ లో శర్వానంద్ తో పాటు అమల అక్కినేని కూడా పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ద్విభాష చిత్రంను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఏడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో అమల అక్కినేని రీ ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా క్రేజ్ బాగా పెరుగుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నటించి మళ్లీ వెండి తెరపై కనిపించకుండా పోయిన అమల ఈసారైనా కంటిన్యూగా సినిమాలు చేసేనా అంటూ అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చి అమ్మగా అత్తగా మంచి పాత్రలు పోషిస్తున్నారు. అందుకే ఈ చిత్రం తర్వాత కూడా అమలా కంటిన్యూ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Please Read Disclaimer