బాలీవుడ్ రీమేక్ లో అక్కినేని

0

`మజిలీ` గ్రాండ్ సక్సెస్ అనంతరం నాగచైతన్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. చై-సామ్ జంట కెరీర్ కి మజిలీ ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే. చైతూ కి మార్కెట్లో ఇమేజ్ పెంచిన చిత్రమిది. సమంత కు ఆ తర్వాత అన్ని రకాలుగా కలిసొస్తోంది. అందుకే ఈ ఇద్దరి ప్రణాళికల పై అక్కినేని అభిమానుల ఆరాలు ఎక్కువే అయ్యాయి. ప్రస్తుతం చైతన్య మేనమామ వెంకటేష్ తో కలిసి `వెంకీ మామ` చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసి శేఖర్ కమ్ములతో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తదుపరి సినిమాల కథల్ని వింటున్నాడు చైతన్య. అంతే కాదు స్క్రిప్టు నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట.

చైతన్య కు ఇప్పటికే కథలు వినిపించిన వారిలో ఆర్.ఎక్స్ -100 ఫేం అజయ్ భూపతి తో పాటు పలువురు యువ దర్శకులు ఉన్నారు. అజయ్ భూపతి ప్రాజెక్ట్ ఫైనల్ అయినా ఇంకా ఎందుకనో అధికారకంగా ప్రకటించ లేదు. ఈ నేపథ్యం లో తాజాగా చైతూ ఓ బాలీవుడ్ రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఇటీవలే రిలీజై విజయం అందుకున్న బాలీవుడ్ చిత్రం `చిచ్చోరే` రీమేక్ లో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాడట. సుషాంత్ రాజ్ పుత్- శ్రద్దా కపూర్- వరుణ్ వర్మ- ఏజెంట్ ఆచార్య ఫేం.. తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకుల ను కడుపుబ్బా నవ్వచింది. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికి ఈ రీమేక్ విషయంలో ఇంకా చర్చల దశలోనే ఉన్నారని తెలుస్తోంది.

ఒకవేళ అన్నీ కుదిరితే గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహించే వీలుందట. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి మందుకొచ్చిందని తెలుస్తోంది. అయితే మజిలీ లాంటి స్ట్రెయిట్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన చైతూ ఈసారి రీమేక్ పైనా దృష్టి సారిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకు ముందు మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ రీమేక్ లో నటించిన చైతన్యకు ఆ చిత్రం ప్లస్ అయ్యింది. మరోసారి ఆ తరహా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఎలాంటి రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు. త్వరలోనే చైతూనే స్వయంగా అసలు సంగతి వెల్లడిస్తారేమో.
Please Read Disclaimer