కిలాడీ అంతటివాడే నిత్యాకి సెల్యూట్ చేశాడు!

0

సౌందర్య తర్వాత అంతటి ప్రతిభావని గా సౌత్ ఇండస్ట్రీ గుర్తించింది. ఆ నవ్వు.. నడక నడత.. రూపం .. నటన ప్రతిదీ జూనియర్ సౌందర్యనే తలపిస్తోందంటూ అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే నిత్యా సౌత్ లో ఎదురే లేకుండా కెరీర్ ని సాగించింది. ఒకానొక దశలో అగ్ర కథానాయికకు దక్కినంత గౌరవం దక్కింది. అయితే ఆ తర్వాత తనకు తానే బౌండరీస్ పెట్టుకుని పరిధిని తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఏమైందో ఇటీవల కొంత కాలంగా నిత్యా తెలుగు సినీపరిశ్రమకు దూరమైంది.

అయితే తనకు ఆఫర్లు రాకనో.. లేక పారితోషికాలు గిట్టకనో ఇలా దూరం కాలేదు. తన కంఫర్ట్ లెవల్స్ ని దాటి నిత్యా ఏ పనీ చేయదు. తనకు నచ్చకపోతే స్టార్ హీరోల ఆఫర్లను నిరభ్యంతరంగా తిరస్కరించింది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ కంటే నటనకు ఆస్కారం ఉన్న లేడీ ఓరియెంటెడ్ కే ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రస్తుతం తమిళంలో అమ్మ జయలలిత బయోపిక్ `ది ఐరన్ లేడీ` చిత్రంలో నటిస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఊపులోనే సౌత్ నుంచి నార్త్ కి వెళుతోంది నిత్యా. కిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి `మిషన్ మంగళ్` లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించింది. ఉపగ్రహ ప్రయోగం చేసే సైంటిస్టుల టీమ్ లో ఓ కీలక పాత్రను నిత్యా పోషించింది. అక్కడ నటించేప్పుడు నిత్యాకు చిత్రయూనిట్ ఇచ్చిన గౌరవం గురించి.. అలాగే కిలాడీ అక్షయ్ కుమార్ తనను ట్రైలర్ ఈవెంట్లో పరిచయం చేసిన విధానంపైనా ప్రస్తుతం సౌత్ లోనూ చర్చకొచ్చింది. నిత్యా నట ప్రతిభ గురించి తెలిసిన ఉత్తరాది స్టార్లు సెట్స్ లో తనకు ఎంతో గౌరవం ఇచ్చారట. కిలాడీ అక్షయ్ కుమార్ అయితే ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిత్యాని పరిచయం చేస్తూ `ది మోస్ట్ పవర్ ఫుల్ యాక్ట్రెస్ ఇన్ ది కంట్రీ` అంటూ ప్రశంసలు కురిపించారు. తాప్సీ-సోనాక్షి-విద్యాబాలన్ లాంటి స్టార్లు ఉన్న వేదికపై నిత్యాకే ప్రత్యేకించి అంత గొప్ప ప్రశంస దక్కిందంటే ప్రతిభకు దక్కిన గౌరవం అనే చెప్పాలి. ఒక నటికి ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేం ఉంటుంది. బాలీవుడ్ లోనే అగ్ర కథానాయకుడిగా దశాబ్ధాల హిస్టరీ ఉన్న ఒక స్టార్ తనని ఇంత గొప్పగా పరిచయం చేశారంటే అది ఎంతో ప్రతిభావని అయితే కానీ సాధ్యం కాదు. ఆగస్టు 15న `మిషన్ మంగళ్` రిలీజవుతోంది. ఈ చిత్రంలో నిత్యా ట్రెడిషనల్ లుక్ తో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ట్రైలర్ ఈవెంట్లోనూ నిత్యా చీరలో తళుక్కుమంది.
Please Read Disclaimer