అల బాలీవుడ్ రీమేక్.. హీరో ఎవరు?

0

హిందీ మార్కెట్లో తెలుగు సినిమా కథలకు మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు బాలీవుడ్ సహా ఇరుగు పొరుగు భాషల్లోనూ రీమేకై ఘనవిజయం సాధిస్తున్నాయి. ఇటీవల అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ `కబీర్ సింగ్` సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ క్రమంలోనే తెలుగులో విమర్శకుల ప్రశంసలు పొందిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కబీర్ సింగ్ ఫేం షాహిద్ కపూర్ ఈ చిత్రం లో కథానాయకుడి గా నటిస్తున్నారు. అలాగే తెలుగు-తమిళం లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కాంచన చిత్రాన్ని అక్షయ్ ప్రధాన పాత్రలో లారెన్స్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి బరిలో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అల వైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాస్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే హిందీ రీమేక్ లో కథానాయకుడు ఎవరు? దర్శకుడెవరు? అన్నది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. అక్కడ ఎవరు నటిస్తే బావుంటుంది? అన్నదానిపై ప్రస్తుతం ఆలోచన సాగుతోందట.

అల్లు అరవింద్ బాలీవుడ్ లోనూ ఫేమస్ నిర్మాత. అక్కడ తొలి 100 కోట్ల క్లబ్ సినిమాని తెరకెక్కించింది అరవింద్. `గజినీ` రీమేక్ ని అదే టైటిల్ తో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అమీర్ ఖాన్ సహా బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ ఆయన కు సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమంలోనే అల వైకుంఠపురము లో హిందీ రీమేక్ కి ఏ స్టార్ ఓకే చెబుతారు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ ని దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer