సొంత డిజిటల్ ప్లాన్స్ అటకెక్కినట్టేనా?

0

అరచేతి వైకుంఠం చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ పెను విప్లవానికి ఈ వైకుంఠమే ప్రధాన కారణం. స్మార్ట్ ఫోన్.. ట్యాబ్స్.. ల్యాప్స్ వాడకం విస్తృతం అయిన దగ్గరి నుంచి డిజిటల్ ప్రపంచం శాసించడం మొదలుపెట్టింది. దీంతో అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రంగాన్ని ఆక్రమించడం మొదలుపెట్టాయి. 2017 నుంచి వీటి ప్రభావం భారతీయ సినీ మార్కెట్ పై పడింది. తాజాగా స్థానిక మార్కెట్ పై కన్నేసిన నెట్ ఫ్లిక్స్.. అమెజాన్.. హాట్ స్టార్ (వాల్ట్ డిస్నీ సబ్సిడరీ) సంస్థలు ఇక్కడి సినిమాల మార్కెట్ పై ప్రభావం చూపించడం మొదలు పెట్టాయి. దీనికి తోడు మన దేశానికి చెందిన జీ 5 వంటివి కూడా వెబ్ సిరీస్ లు.. అడల్ట్ కామెడీ సినిమాలు.. రెగ్యులర్ చిత్రాల్ని స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది.

దీంతో సినిమాల కోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా తగ్గడం మొదలైంది. థియేటర్లలో పెట్టే ఒక్క టిక్కెట్ విలువతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో నెల రోజులు నచ్చిన సినిమాలు చూసే వెసులుబాటు లభిస్తుంటే సామాన్య ప్రేక్షకుడు సినిమా కోసం ప్రత్యేకంగా థియేటర్ కు ఎందుకు వెళతాడు?.. పైగా కొత్త చిత్రాలన్నీ డిజిటల్ మాధ్యమాల్లో 30- 40 రోజుల్లోనూ అందుబాటులోకి వస్తుండటంతో సినిమా వ్యాపారం దెబ్బతింటోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న డి. సురేష్ బాబు- దిల్ రాజు- అల్లు అరవింద్- యువీ వంటి నిర్మాతలు నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ లకు పోటీ గా సొంత ఒటీటీ కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారని ఇంతకు ముందు ప్రచారమైంది.

అయితే అనుకున్న స్థాయి లో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. తమ సినిమాలని నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ లకు అమ్మకుండా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే స్ట్రీమింగ్ చేయాని ప్లాన్ చేసుకున్న బడా నిర్మాతలు ఒకరికి తెలియకుండా ఒకరు అవే సంస్థలకు తమ చిత్రాల్ని అప్పగిస్తుండటంపై సెటైర్లు పడుతున్నాయి. సొంత ఓటీటీ అంటూనే దొడ్డి దారిని అమ్ముకుంటున్నారని.. ఇలా అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ అటకెక్కినట్టేనని పంచ్ లు వేస్తున్నారు. ఇక అల్లు అరవింద్- శిరీష్ ద్వయం సొంత ఓటీటీ వేదికను రెడీ చేస్తున్నారని ప్రచారమైంది. దానికి సంబంధించిన తాజా అప్ డేట్ రివీల్ కాలేదు ఎందుకనో.

ఇకపోతే డిజిటల్ వేదిక పై ఇకపై రిలయన్స్ జియో సునామీలా దూసుకొస్తోంది. 2020 లో రిలయన్స్ ముఖేష్ అంబానీ ప్రణాళికలు చూస్తుంటే ఇకపై ఇన్నాళ్లు థియేటర్ల కబ్జా.. ఈ కామర్స్ కబ్జా ఇవేనా అనుకుంటే.. డిజిటల్ కబ్జా కూడా మొదలైపోయినట్టేననన్న సంకేతాలు అందుతున్నాయి.
Please Read Disclaimer