సుక్కు.. బన్నీ లేకుండానే!

0

‘రంగస్థలం’ రిలీజై ఏడాదిన్నర దాటినా సుకుమార్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదింకా. సుక్కు కొత్త సినిమా ఒక థ్రిల్లర్ అని వార్తలొచ్చాయి. ఐతే సినిమాలో ఎన్ని మలుపులుంటాయో ఏమో కానీ.. ఈ చిత్రం పట్టాలెక్కడానికి ముందు మాత్రం అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబుతో అనుకున్న ఈ చిత్రంలోకి అల్లు అర్జున్ రావడం అతి పెద్ద మలుపు. బన్నీ హీరోగా ఖరారయ్యాక కూడా చాలా కాలం ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఐతే గత నెలలో ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం పూర్తి చేసి దీనిపై నెలకొన్న సందేహాలకు తెరదించారు. డిసెంబరులో షూటింగ్ అని కూడా అప్పుడే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదన్నది తాజా కబురు.

ఈ నెల 11న కేరళలో బన్నీ-సుకుమార్ సినిమా చిత్రీకరణ ఆరంభం కాబోతోంది. కాకపోతే ఈ షెడ్యూల్లో బన్నీ పాల్గొనే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ‘అల వైకుంఠపురములో’కు సంబంధించి బన్నీ పని పూర్తయినప్పటికీ.. కొంత విశ్రాంతి తీసుకుని – సుక్కు సినిమా కోసం అతను లుక్ మార్చుకోవాల్సి ఉంది. ఈ లోపు సుక్కు కేరళలో ట్రయల్ షూట్ లాంటిది నిర్వహించి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తాడట. హీరో ప్రమేయం లేని ఒక యాక్షన్ సీక్వెన్స్ ను సుక్కు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాడట. సుక్కు ఆస్థాన ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ సినిమాకు పని చేయట్లేదన్నది తెలిసిన విషయమే. ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ కు పరిచయం అయిన పోలెండ్ సినిమాటోగ్రాఫర్ కూబా ఈ చిత్రానికి పని చేయనున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి అతను ఇప్పటికే వివిధ లొకేషన్లలో రెక్కీ నిర్వహించి వచ్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది. రష్మిక మందన్నా కథానాయిక.
Please Read Disclaimer